గాజా ఆసుపత్రిపై ఇజ్రాయిల్‌ క్షిపణి దాడి

గాజా : గాజాలో శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులపై అమానుష దాడులతో విరుచుపడుతున్న ఇజ్రాయిల్‌ తాజాగా మరో దాడికి తెగబడింది. ఆదివారం ఉదయం గాజాలోని ప్రధాన ఆసుపత్రి అల్‌-అహ్లి అరబ్‌ బాప్టిస్ట్‌పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులు అత్యవసర విభాగం, రిసెప్షన్‌ను ధ్వంసం చేశాయని, భవనంలో ఇతర నిర్మాణాలను దెబ్బతీశాయని వైద్యులు తెలిపారు. ఈ దాడి గురించి ముందస్తు సమాచారం ఉండటంతో అందులో ఉన్న రోగులను ముందుగానే ఖాళీచేయించారు. దాడికి కొన్ని నిమిషాల ముందు ఇజ్రాయిల్‌ భద్రతా సిబ్బందితో పరిచయం ఉన్న ఒక వ్యక్తి నుండి తమకు సమాచారం వచ్చిందని, దీంతో ఆస్పత్రి నుండి రోగులను ఖాళీ చేయించామని ఆరోగ్య అధికారులు తెలిపారు. కొందరు రోగులను ఆస్పత్రి బెడ్‌లపై నుండి తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడులను హమాస్‌, ప్రభుత్వ మీడియా కార్యాలయం ఖండించాయి. గాజాలో వైద్యఆరోగ్య వ్యవస్థను ఇజ్రాయిల్‌ ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

దాడిని ఖండించిన బ్రిటన్‌

గాజాలో ఆసుపత్రిపై ఇజ్రాయిల్‌ దాడిని బ్రిటన్‌ ఖండించింది. ఈ దాడిని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ లామీ ‘శోచనీయం’ అని విమర్శించారు. ‘వైద్య సౌకర్యాలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులు గాజాలో ఆరోగ్య సంరక్షణ అందుబాటును పూర్తిగా దిగజార్చాయి’ అని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అల్‌-అహ్లీ ఆసుపత్రిపై పదేపదే దాడులు జరుగుతున్నాయి. ఈ దారుణమైన దాడులు ముగించాలి. శాశ్వత శాంతిని సాధించడానికి దౌత్యమే మార్గం. రక్తపాతం కాదు’ అని పోస్టులో పేర్కొన్నారు.

➡️