రఫాలోకి ఇజ్రాయిల్‌ ట్యాంకులు

May 29,2024 23:40 #Israeli tanks, #Rafah

గాజా : రఫాతో సహా మొత్తంగా గాజాపై దాడులను ఆపేందుకు అంతర్జాతీయ సమాజం తర్జన భర్జనలు పడుతుంటే మరోపక్క ఇజ్రాయిల్‌ బుధవారం ఉదయం కూడా రఫావ్యాప్తంగా దాడులు జరిపింది. రఫాలోకి ఇజ్రాయిల్‌ ట్యాంకులు చొచ్చుకు పోతున్నాయని ప్రత్యక్ష సాక్షులు, పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. బయటకు ఎవరైనా వస్తే ఇజ్రాయిల్‌ డ్రోన్‌లతో కాల్చేస్తున్నందున ప్రస్తుతం ప్రజలు ఇళ్ళలోపలే వుంటున్నారని అక్కడి నివసిస్తున్న అబ్దుల్‌ ఖతీబ్‌ తెలిపారు. బదర్‌ శిబిరాన్ని, రఫాకు పశ్చిమంగా గల జురోబ్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. మంగళవారం 13 మంది బాలికలు, మహిళలతో సహా 21మంది పాలస్తీనియన్లు మరణించారు. రఫాలోని అల్‌మవాసి ఏరియాలోని నిర్వాసితుల శిబిరంపై ఈ దాడులు జరిగాయని పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. ఆర్మీ ఆదేశాల మేరకే నిర్వాసితులు అక్కడకు వచ్చి తలదాచుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆర్మీ దాడులు జరిపింది. రఫా వ్యాప్తంగా కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌ సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం ఫిలడెల్ఫి కారిడార్‌పై మిలటరీ పట్టు సాధించింది. ఆ కారిడార్‌ పశ్చిమంగా లోపలకు ట్యాంకులు దూసుకువెళుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. గతంలో ఉత్తర, సెంట్రల్‌ గాజా ప్రాంతాలపై దాడి చేసినపుడు రఫా నగరాన్ని సురక్షితమైన జోన్‌గా ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. దాంతో గాజాలో దాదాపు సగానికి సగం మంది నిర్వాసితులు అక్కడకే చేరుకున్నారు. ఇప్పుడు అక్కడే దాడులు మొదలవడంతో ప్రాణనష్టం విపరీతంగా వుంటోంది. దాడులు మొదలైన తర్వాత దాదాపు 10లక్షల మంది రఫాను వీడినట్లు తెలుస్తోంది.
రోజుకు 500 ట్రక్కులకు పైగా ఆహారం అవసరమవుతుండగా, గత మూడు వారాల్లో కేవలం 170 ట్రక్కుల సాయం మాత్రమే అందిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సమీప భవిష్యత్తులో రఫా క్రాసింగ్‌ను తెరిచే అవకాశాలు కనిపించడం లేదని పాలస్తీనా ఆరోగ్య మంత్రి చెప్పారు. నిత్యావసరాలు, మందులు సరఫరాలకు ఈ క్రాసింగ్‌ కీలకం.

➡️