Japan election : జపాన్‌ ప్రతినిధుల సభకు రికార్డు సంఖ్యలో మహిళలు

టోక్యో : జపాన్‌ ప్రతినిధుల సభకు రికార్డు సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. అయినా కూడా వీరి సంఖ్య 16శాతం కన్నా తక్కువే ఉంది. పార్లమెంటు దిగువ సభలోని మొత్తం 465 స్థానాలకు గాను మహిళలు 73 స్థానాలను గెలుచుకున్నారని ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్‌ ఎన్‌హెచ్‌కె పేర్కొంది. 2021లో జరిగిన ఎన్నికల్లో 45మంది మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. జపాన్‌లో వ్యాపార, రాజకీయ రంగాల్లో మహిళా నేతలు ఇప్పటికీ అరుదనే చెప్పాలి. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వేదిక వెలువరించిన అంతర్జాతీయ లింగ నిష్పత్తిపై నివేదిక ప్రకారం 146 దేశాల జాబితాలో జపాన్‌ 118వ స్థానంలో వుంది. ప్రస్తుత కేబినెట్‌లో ఇద్దరు మహిళలు మాత్రమే వున్నారు. జపాన్‌లో రాజకీయ పార్టీలన్నీ పురుషాధిక్యతతోనే వుంటాయని, అరమరికలు లేని రీతిలో పనిచేయవని, అందువల్ల మహిళా అభ్యర్ధులు వుండడం కష్టమవుతుందని ‘నో యూత్‌ నో జపాన్‌’ అధ్యక్షురాలు మొమొకొ నొజో గత నెలలో పాలక పార్టీ నాయకత్వ ఎన్నికల ముందు వ్యాఖ్యానించారు. 2021లో కేబినెట్‌ ఆఫీస్‌ నిర్వహించిన సర్వే ప్రకారం, జపాన్‌లో మహిళా అభ్యర్ధుల్లో ప్రతి నలుగురిలో ఒకరు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జిజి ప్రెస్‌ పేర్కొంది.

➡️