జపాన్‌ ఎన్నికల్లో పాలక పార్టీ పరాజయం

Oct 29,2024 00:18 #hung parliament, #Japan
  • హంగ్‌ పార్లమెంటు

టోక్యో : ఆదివారం జరిగిన ఎన్నికల్లో జపాన్‌ పాలక పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణాలతో కళంకితమైన ప్రధాని షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇషిబా రాజీనామా చేస్తారన్న వార్తలొచ్చినప్పటికీ, ఆయన మాత్రం కుర్చీని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు అనిశ్చితిలో పడింది. పాలక ఎల్‌డిపి పార్టీ ఇంతటి దారుణ ఓటమిని చవి చూడడం 2009 తరువాత ఇదే మొదటిసారి. ఈ సారి హంగ్‌ ఏర్పడడంతో జపాన్‌ కరెన్సీ యెన్‌ మూడు మాసాల కనిష్టానికి పడిపోయింది. ఈ రాజకీయ అనిశ్చితి జపాన్‌ను కొన్ని వారాలపాటు వెంటాడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికపరంగా, భద్రతా పరంగా చాలా సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటువంటి ప్రతిష్టంభనను మనం ఎంతమాత్రమూ అనుమతించలేమని ఓడిపోయిన ప్రధాని ఇషిబా వ్యాఖ్యానించారు. తాను ప్రధానిగా కొనసాగుతానన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ దిగువ సభలో మొత్తం 465 స్థానాలకు గాను ఇషిబా లిబరల్‌డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డిపి), దాని సంకీర్ణ భాగస్వామి కొమెటోకు కలిపి 215సీట్లు మాత్రమే వచ్చాయి. .ఈ కూటమి గత సారి ఎన్నికల్లో 279సీట్లు సాధించింది. పెరుగుతున్న జీవన వ్యయ సంక్షోభమే ఈ ఓటమికి ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇద్దరు మంత్రులు, కొమెటో నేత కూడా పరాజయం పాలయ్యారు. ప్రధాన ప్రతిపక్షం కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ జపాన్‌ (సిడిపిజె)కు గతంలో 98వుండగా ఈసారి 148సీట్లు గెలుచుకుంది. అయితే ఈ కూటమికి కూడా మెజారిటీకి కావాల్సిన 233 సీట్లు రాలేదు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం 30రోజుల్లోగా ఈపార్టీలు పాలించే కూటమిని రూపొందించుకోవాల్సి వుంటుంది. నెల రోజుల క్రితమే ఇషిబా ప్రధాని పదవి చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎంతకాలం పదవిలో వుంటారో స్పష్టంగా తెలియడం లేదు. కాగా తాము కూడా ఇతర పార్టీలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావడానికి కృషి చేస్తామని సిడిపిజె నేత యోషిహికో నోడా చెప్పారు.

➡️