ఫ్రాన్స్ : న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి (ఎన్‌పిఎఫ్) నుండి ప్రధాన మంత్రిని నియమించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిరాకరించారు. ఈ చర్యకు వ్యతిరేకంగా మంగళవారం ఫ్రాన్స్‌లోని వామపక్షనేతలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గత నెలలో జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పిఎఫ్ కూటమి (కమ్యూనిస్టులు, సోషలిస్టులు, గ్రీన్స్ పార్టీల కూటమి) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. తదుపరి ప్రధాన మంత్రిగా ఎన్‌పిఎఫ్ కూటమి పారిస్ సివిల్ సర్వెంట్ అయిన లూసీ కాస్టెట్స్‌ను ప్రతిపాదించింది. అయితే కొత్త ప్రధానమంత్రిని నియమించే అధికారం అధ్యక్షుడికి మాత్రమే ఉంది. అయితే, అధ్యక్షుడికి వున్న వీటో అధికారంతో ప్రధానమంత్రి నియమించడానికి మాక్రాన్ అడ్డుపడుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటానని దాటవేసిన మాక్రాన్… తాజాగా తన సొంత నయా ఉదారవాద సమిష్టి సంకీర్ణానికి చెందిన గాబ్రియేల్ అట్టల్‌ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షపార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
ఏదైనా తన అధికారంతో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో వామపక్ష పార్టీలను మినహాయించాలనే ఉద్దేశం మాక్రాన్‌కి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సందర్బంగా మాక్రాన్ మాట్లాడుతూ.. ‘సోషలిస్ట్, గ్రీన్స్, కమ్యూనిస్టులు ఇతర రాజకీయ శక్తులతో సహకరించే మార్గాలను ఇంకా ప్రతిపాదించలేదు. అలా చేయడం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది’ అని ఆయన అన్నారు. మాక్రాన్ వ్యాఖ్యలపై వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. ‘పేరడి ప్రజాస్వామ్యంలో భాగస్వామి’గా ఉండటానికి నిరాకరిస్తున్నట్లు సోషలిస్టు పార్టీ నాయకుడు ఆలివర్ ఫౌరే అన్నారు. గ్రీన్ పార్టీ నాయకురాలు మెరైన్ టోండెలియర్ మాట్లాడుతూ.. ‘తాజాగా జరిగిన ఎన్నికలు మా నుండి దొంగిలించబడుతున్నాయి’ అని ఆమె ఆరోపించారు. ఈ బూటకపు సంప్రదింపుల్లో పాల్గనడానికి నిరాకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కాగా, తాత్కాలిక ప్రధానమంత్రి నియామకానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఫాబియన్ రౌసెల్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల సందర్బంగా ఎన్‌పిఎఫ్ తరపున ప్రధానిగా ప్రతిపాదించిన కాస్టెట్స్.. ‘ఓటును తప్పుగా వినియోగించుకున్నారంటూ… ఫ్రాన్స్ ప్రజలను మాక్రాన్ తప్పుదోవ పట్టిస్తున్నారని’ రేడియోలో ప్రజలకు తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే అధ్యక్షుడే కాదు అని ఆమె అన్నారు.