- మరణ సహాయ బిల్లును ఆమోదించిన బ్రిటన్ ఎంపీలు
లండన్ : దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ, జీవించే ఇచ్ఛ లేక కుటుంబానికి భారంగా తయారయ్యామని బాధపడేవారు తమ జీవితాలను అంతమొందించుకోవడానికి సాయపడే మరణ సహాయ బిల్లు (కారుణ్య మరణాలు)ను బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఆమోదించారు. అయితే ఇది తొలి అడుగు మాత్రమే. ఈ బిల్లుకు సూత్రప్రాయ ఆమోదమే లభించింది. దీనిపై తుదిగా ఓటింగ్ జరగడానికి ముందుగా మరింత కూలంకష పరిశీలన జరగనుంది. ఈ బిల్లు 330-275 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. నైతిక విలువలు, విశ్వాసాలు, చట్టాలు, నిబంధనలు ఇలా పలు అంశాలపై సుదీర్ఘంగా గంటల తరబడి చర్చ సాగింది. అప్పుడప్పుడూ భావోద్వేగాలు కూడా చోటు చేసుకున్నాయి. శారీరక బాధలను నివారిస్తూ, గౌరవప్రదంగా చనిపోవడానికి ఈ బిల్లు మద్దతిస్తుందని దీన్ని సమర్ధించేవారు అంటున్నారు. కాగా ఈ చర్య వల్ల వికలాంగులు, వృద్ధులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ముప్పును ఎదుర్కొంటారని, తమపై భారాన్ని వదిలించుకోవడానికి లేదా డబ్బును ఆదా చేసుకోవడానికి కుటుంబ సభ్యులే వారిని అంతమొందిస్తారని ఈ బిల్లును వ్యతిరేకించే వారు వాదిస్తున్నారు. 18 ఏళ్ళు దాటి భయంకరమైన జబ్బులతో సుదీర్ఘంగా బాధపడుతున్నవారెవరైనా ఈ బిల్లు కింద స్వచ్ఛంద మరణాన్ని ఎంచుకోవచ్చు. తమ జీవితాలను అంతమొందించుకోవడమెలా అనే విషయంపై వీరికి సూచనలు అందించడమే ఈ బిల్లు లక్ష్యంగా వుంది. జీవన్మరణాల మధ్య గల చాయిస్ గురించి మనం మాట్లాడుకోవడం లేదని, బాధలతో చనిపోవాలనుకుంటున్నవారు ఎలా చనిపోవాలో చెప్పాలనుకుంటున్నామని ఈ బిల్లును ప్రతిపాదించిన కిమ్ లీడ్‌బీటర్ అన్నారు.