ఫాసిజాన్ని ఎదిరిద్దాం

Nov 28,2024 23:59 #call, #fascism, #Let's resist, #Venezuela's
  • వెనిజులా పిలుపు
  • అంతర్జాతీయంగా ఫాసిస్ట్‌ వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించేందుకు కమిటీ

కారకస్‌ : ఫాసిస్ట్‌ వ్యతిరేక, వలసవాద, సామ్రాజ్యవాద వ్యతిరేక విలువలకు రక్షణగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు వెనిజులా ప్రభుత్వం అంతర్జాతీయ ఫాసిస్ట్‌ వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించే కమిటీని ఏర్పాటు చేసింది. ఫాసిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొంది. అధ్యక్షుడు నికొలస్‌ మదురో చేసిన ప్రతిపాదనతో ఈ చొరవను చేపట్టారు. కమిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెనిజులా విదేశాంగ మంత్రి యాన్‌ గిల్‌ మాట్లాడుతూ, ఈ విలువల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించాలని, ఫాసిజాన్న్ని కచ్చితంగా ఓడించే లక్ష్యంతో అంతర్జాతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని పిలుపిచ్చారు. పశ్చిమ దేశాల్లో ఫాసిజం ముప్పు బాగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఫాసిస్ట్‌ వ్యతిరేక, వలసవాద వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరారు. 75 దేశాలకు చెందిన దాదాపు వెయ్యిమంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్మికులపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేం దుకు సామ్రాజ్యవాదం ఈ ఫాసిజాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని గిల్‌ విమర్శించారు. అదే రీతిలో భయానకతను నిర్మూలించడానికి సోషలిజం ఒక్కటే మార్గమని ఉద్బోధించారు. సామ్రాజ్యవాదం సేవలో ఈ ఫాసిజం భావజాలం తరిస్తున్నదని వ్యాఖ్యానిం చారు. ప్రజలపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి, వారి వనరులను కొల్లగొట్టడానికి ఇది ప్రయత్నిస్తోం దన్నారు. ప్రపంచం నేడు కీలకమైన మలుపులో వుందని,సహజ వనరునుల లూటీ చేసి బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు ఫాసిజం తోడ్పడుతుందన్నారు. మన ప్రజల కష్టాలకు, సామాజిక రుగ్మతలకు అసలు కారణం వలసవాదమేనన్నారు. 1945లో ఫాసిజాన్ని దాదాపుగా ఓడించినా, ఆనాటి బూర్జువా వ్యవస్థలు, పెత్తందారుల్లో అది విలీనమై, నేడు తిరిగి ప్రజలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం గురించి గిల్‌ ప్రస్తావించారు. నాజీవాదానికి అవశేషంగా ఉక్రెయిన్‌ మిగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ దేశానికి అమెరికా మద్దతునివ్వడం సిగ్గుచేటన్నారు. సామ్రాజ్యవాదం, విద్వేషాలు లేని మెరుగైన ప్రపంచం కోసం పోరాడాలని, ఇది సుదీర్థమైన పోరాటమే అయినా మానవాళి కోసం, న్యాయం కోసం, శాంతి కోసం దీనిని సాగించి తీరాల్సిందేనన్నారు.

➡️