యుఎస్‌ ఎయిడ్‌ సంస్థకు తాళాలు

Feb 4,2025 00:13 #Keys, #USAID
  • సిబ్బందిని బయటే వుండాల్సిందిగా ఆదేశాలు
  • అదో నేర సంస్థ అంటూ మస్క్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ అభివృద్ధికి సాయమందించే సంస్థ యుఎస్‌ఎయిడ్‌ సిబ్బందిని వాషింగ్టన్‌లోని ప్రధాన కార్యాలయానికి వెలుపల వుండా ల్సిందిగా సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ మేరకు వారికి నోటీసులు అందచేశారు. సంస్థను మూసివేసేం దుకు అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థలోని కంప్యూటర్‌ వ్యవస్థలకు దూరంగా వుండాల్సిందిగా రాత్రికి రాత్రి 600మంది ఉద్యోగులకు ఆదేశాలు వెళ్ళాయని సంస్థలోని సిబ్బంది చెప్పారు. ఇంకా కంప్యూటర్లపై పనిచేస్తున్న వారికి ఇ మెయిల్స్‌ అందాయి. సంస్థ నాయకత్వం ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయం భవనాన్ని సోమవారం నుండి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న యుఎస్‌ ఎయిడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థను మూసివేయడానికి ట్రంప్‌ అంగీకరించారంటూ సోమవారం తెల్లవారు జామున మస్క్‌ ప్రకటించారు. ఆ వెంటనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి.
సంస్థకు సంబంధించిన రహస్య సమాచారం, పత్రాలను మస్క్‌ తనిఖీ బృందాలకు అప్పగించడానికి ఇద్దరు సెక్యూరిటీ చీఫ్‌లు నిరాకరించడంతో వారిద్దరిని ప్రభుత్వం శలవుపై పంపింది. ఆ నేపథ్యంలో మస్క్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. యుఎస్‌ఎయిడ్‌ సంస్థ ఒక నేర సంస్థ ఇక దాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని మస్క్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా అందించే సహాయ కార్యకలాపాలకు కొత్తగా నిధులు అందించడాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్తంభింపచేసింది. అమెరికా విధానాలకు అనుగుణంగా విదేశాలకు చేసే సాయం వుంటోందా లేదా అని సమీక్షలు జరుపుతున్న తరుణంలో ఈ చర్యలు, వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

➡️