కారకాస్ : వెనిజులా అధ్యక్షునిగా నికొలస్ మదురో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. దేశాధ్యక్షునిగా మదురో బాధ్యతలు స్వీకరించడం ఇది మూడోసారి. ఆయన ఆరు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో మదురో ప్రసంగిస్తూ ‘శాంతి, సౌభాగ్యం, సమానత్వం, నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నాను’ అని తెలిపారు. దేశ చట్టాలను గౌరవిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. ‘నేను చరిత్ర మీద, నా జీవితం మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టుకుంటాను. వారి సమస్యలు పరిష్కరిస్తాను’ అని అన్నారు.
వామపక్ష దిగ్గజ నేత హ్యూగో ఛావెజ్ 2013లో మరణించడంతో మదురో వెనిజులా పగ్గాలు స్వీకరించారు. మదురోను దేశ ప్రజలు ఎన్నుకుంటున్నప్పటికీ ఆయనను వెనిజులా అధ్యక్షునిగా గుర్తించేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు నిరాకరిస్తున్నాయి. ఇటీవల కన్నుమూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ వంటివారు వెనిజులా ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగాయని సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత కూడా అమెరికా పాత పాటే పాడుతోంది. ఎన్నికల్లో రిగ్గింగ్, అక్రమాలు చోటు చేసుకున్నాయని నానా యాగీ చేస్తోంది. ఓడిపోయిన ప్రతిపక్ష అభ్యర్థి గొంజాలెజ్‌ను అధ్యక్షునిగా గుర్తిస్తామని చెబుతోంది. ఇంతకుముందు కూడా అది ఇటువంటి కుటిల ఎత్తుగడలే వేసి అభాసుపాలైంది. 2018 ఎన్నికల్లో మదురో విజయం సాధించినా ఆయన ప్రత్యర్థి, ప్రతిపక్ష నాయకుడు జువాన్ గెయిడోను పశ్చిమ దేశాలు అధ్యక్షునిగా గుర్తించాయి. మదురో ప్రభుత్వంపై కత్తిగట్టాయి. అనేక ఆంక్షలు విధించాయి. గత జూలైలో జరిగిన ఎన్నికల్లో మదురోను ఓడిస్తామని ప్రతిపక్షాలు బీరాలు పలికాయి. అయితే 51 శాతం ఓట్లతో మదురో విజయకేతనం ఎగరేశారు. ప్రతిపక్ష నేత గొంజాలెజ్‌పౖౖె అరెస్ట్ వారంట్ జారీ చేయడంతో ఆయన స్పెయిన్‌కు పారిపోయారు. గొంజాలెజ్ ఈ వారం ప్రారంభంలో అమెరికాలో పర్యటించి అధ్యక్షులు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. మదురో అరెస్టు సమాచారం అందిస్తే ఇస్తానన్న రివార్డు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల నుండి 25 మిలియన్ డాలర్లకు పెంచింది. అంతేకాక మదురోకు మద్దతు ఇస్తున్న వ్యక్తులపై అమెరికా ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వాటిలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీ పెట్రోలియస్ డీ వెనెజులియా చైర్మన్ హెక్టర్ ఆండ్రస్ ఓబ్రెగాన్ ఉన్నారు.
