మలావీ ఉపాధ్యక్షుడి విమానం అదృశ్యం

  • గాలింపు చర్యలు ముమ్మరం

బ్లాంతైర్‌ : ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్‌ చీలిమాతోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్‌ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్‌ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించిన అధ్యక్షుడు చక్వేరా.. తన బహామాస్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది.

➡️