అక్రమ వలసలపై కఠిన చర్యలకు అంగీకారం
వాషింగ్టన్ : అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లోకి అక్రమ వలసదారుల ప్రవాహాన్ని ఆపడంలో విఫలమైనందుకు మెక్సికో, కెనడా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ బెదిరింపులకు దిగిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. అక్రమ వలసదారులకు సంబంధించి తాను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో ఫోన్‌లో మాట్లాడానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి డ్రగ్స్ ప్రవాహాన్ని అరికట్టేందుకు, ఈ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ఏం చేయాలనే విషయమై ఇద్దరూ మాట్లాడుకున్నారని ట్రంప్ తెలిపారు.
“మా దక్షిణ సరిహద్దులోకి ప్రజలు ప్రవేశించకుండా మెక్సికో అడ్డుకుంటుంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. ఇది అమెరికా(యుఎస్ఎ)లోకి అక్రమ వలసలను ఆపడానికి చాలా దోహదపడుతుంది. ధన్యవాదాలు” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై జనవరి 20న సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. తాను అధికారం చేపట్టిన తర్వాత చేసే పనులలో ఇదొకటని తెలిపారు.