ఇజ్రాయిల్‌ నుంచి గాజాకు పాలస్తీనీయుల తరలింపు

Nov 7,2024 23:48 #Gaza, #Israel, #Migration, #Palestinians
  • చట్టం తీసుకొచ్చిన నెతన్యాహు ప్రభుత్వం
  • వైమానిక దాడుల్లో 27మంది మృతి
  • బీరుట్‌ విమానాశ్రయం సమీపంలో దాడులు

జెరూసలేం : దాడులకు పాల్పడిన, తీవ్రవాదులైన పాలస్తీనియన్ల కుటుంబ సభ్యులను గాజా, ఇతర ప్రాంతాలకు పంపించేసేందుకు అనుమతించే చట్టాన్ని గురువారం ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. ప్రధాని నెతన్యాహుకి చెందిన లికుడ్‌ పార్టీ సభ్యులు, నెతన్యాహ మితవాద మిత్రపక్షాలు ఈ చట్టాన్ని సమర్ధిస్తున్నాయి. 61-41 ఓట్ల తేడాతో పార్లమెంట్‌ సభ్యులు ఆమోద ముద్ర వేశారు. ఇజ్రాయిల్‌లోని పాలస్తీనా పౌరులకు, అలాగే తమ కుటుంబ సభ్యుల దాడుల గురించి ముందుగానే తెలిసినా లేదా తీవ్రవాద చర్యలకు మద్దతిచ్చే అనుబంధ తూర్పు జెరూసలేం నివాసులకు ఈ చట్టం వర్తిస్తుంది. వారందరినీ ఏడు నుండి 20 ఏళ్ల కాలానికి గాజాకు లేదా మరే ఇతర ప్రాంతాలకైనా తరలిస్తామని ఆ చట్టం పేర్కొంటోంది. తీవ్రవాదుల్లో ఇజ్రాయిల్‌ పౌరులు వున్నా వారి పరిస్థితి కూడా ఇదేనని తెలిపింది. ఇజ్రాయిల్‌ జనాభాలో దాదాపు 20శాతం మందిగా వున్న పాలస్తీనియన్లు ఆ దేశంలోనే జీవిస్తున్నారు. వారికి పౌరసత్వం, ఓటు హక్కు వున్నా, విపరీతమైన వివక్ష కూడా అమలవుతూ వుంటుంది. తీవ్రవాద చర్యలతో సంబంధముంటే వారు టీచర్లైనా ముందస్తు నోటీసుల్లేకుండానే ఉద్యోగాల్లోనుండి తీసేయడానికి కూడా ఈ చట్టం అనుమతినిస్తోంది. ఇక్కడి వారందరికీ గాజాలోని వారితో సన్నిహిత కుటుంబ సంబంధాలు వున్నాయి. వీరు పాలస్తీనా ప్రయోజనాల పట్ల సానుభూతితో వ్యవహరిస్తారు.ఇదిలా వుండగా, ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌కు ఈ చట్టం వర్తిస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. దాడులకు పాల్పడిన వారి కుటుంబ నివాసాలను ధ్వంసం చేయాలన్న విధానాన్ని సుదీర్ఘ కాలంగా వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ అమలు చేస్తూనే వుంది. ఇజ్రాయిల్‌ అత్యున్నత న్యాయస్థానంలో దీన్ని సవాలు చేసే అవకాశాలు కూడా తక్కువగానే వున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఇజ్రాయిల్‌ డెమోక్రసీ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్‌ పరిశోధకులు డాక్టర్‌ ఎరాన్‌ షామిర్‌ బోరర్‌ వ్యాఖ్యానించారు.

బీరుట్‌ విమానాశ్రయం సమీపంలో దాడులు

రాజధాని బీరుట్‌ దక్షిణ శివార్లలో, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ప్రాంతంలో ఇజ్రాయిల్‌ ఆర్మీ బుధవారం రాత్రి దాడులకు పాల్పడింది. అయినా గురువారం ఉదయం విమానాశ్రయం సాధారణంగానే పనిచేస్తోందని, విమానాల రాకపోకలు జరుగుతున్నాయని రవాణా మంత్రి తెలిపారు. విమానాశ్రయం సరిహద్దు గోడకు ఆనుకుని వున్న ఫ్యాక్టరీ దారుణంగా దెబ్బతిందని మీడియా వార్తలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్‌లోని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రమైన బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో గల సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని హిజ్బుల్లా ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. బీరుట్‌పై దాడుల వల్ల కొన్ని భవనాలకు స్వల్పంగా నష్టం జరిగినా టెర్మినల్‌ భవనానికి పెద్దగా ఏం జరగలేదని విమానాశ్రయ అధికారి చెప్పారు. తూర్పు లెబనాన్‌లోని బెకా లోయ, బాల్‌బెక్‌ నగరంలో జరిగిన వైమానిక దాడుల్లో 40మంది మరణించారని, 53మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

గాజాలో దాడులు : 27మంది మృతి

గురువారం తెల్లవారు జాము నుండి గాజావ్యాప్తంగా జరిగిన దాడుల్లో 27మంది మరణించారు. వీరిలో 19మంది ఉత్తర గాజాలో దాడుల్లో చనిపోయారని వైద్య బృందాలు తెలిపాయి. ఉత్తర గాజాను పూర్తిగా దారుణమైన రీతిలో ఆర్మీ దిగ్బంధించడంతో పరిస్థితులు సన్నగిల్లుతున్నాయని, యావత్‌ ప్రపంచం చూస్తుండగానే ప్రజల ఆకలితో అలమటిస్తూ కన్ను మూయడం ఖాయంగా కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి మానవతా చీఫ్‌ జోయాస్‌ ఎంసూయ హెచ్చరించారు. అమెరికాలో తయారైన అత్యంత అధునాతనమైన ఎఫ్‌-15 విమానాలు 25 కొనుగోలుచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయిల్‌ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర గాజాలోని వారిని వారి ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించేది లేదని ఆర్మీ స్పష్టం చేసింది.

➡️