మైనార్టీలపై విషం గక్కిన మోడీ

Oct 2,2024 22:13 #minorities, #PM Modi, #poisoned
  • మత విద్వేషాలు రాజేసే యత్నం

హజారీబాగ్‌ (జార్ఖండ్‌) : బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అన్ని హద్దులు ఉల్లంఘించి మైనార్టీలపై విషం గక్కారు. జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుందని ఆయన నిరాధారమైన ఆరోపణలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్‌లో మత విద్వేషాలను రాజేసేందుకు ఆయన బాహాటంగా యత్నించారు. జార్ఖండ్‌ ప్రజల గుర్తింపు, సంస్కృతి, వారసత్వాలను పణంగా పెట్టి చొరబాటుదారులకు మద్దతునివ్వడం ద్వారా జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదకరమైన ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ఎదురు దాడి చేయడం మోడీ తెంపరితనానికి మరో నిదర్శనం. అరిగిపోయిన రికార్డులా మన భుక్తిని, భూమిని, కుమార్తెలను కాపాడుకోవాలంటే అటువంటి శక్తులను బయటకు పారదోలాలని అన్నారు. వీటిని పరిరక్షించుకోవడంతో పాటు అవినీతిపై పోరు సల్పేందుకు జార్ఖండ్‌లో పరివర్తన తీసుకురావాల్సి వుందన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ప్రమాదకరమైన ఆట ఆడుతోందని విమర్శించారు. బిజెపి పరివర్తన యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5400 కిలోమీటర్లు పొడవునా యాత్ర కొనసాగింది. రెండు వారాల వ్యవధిలో మోడీ రెండోసారి ఈ రాష్ట్రంలో పర్యటించారు. ఈ యాత్ర సందర్భంగా ప్రధాని ప్రత్యేక వాహనంలో ముందుకు సాగుతూ గిరిజనులతో మాట్లాడారు. సెప్టెంబరు 20న కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఈ యాత్రను ప్రారంభించారు.

➡️