కొలంబో : ఇండియా – శ్రీలంక దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ నెల ప్రారంభంలో శ్రీలంకలో పర్యటించనున్నారని శ్రీలంక మంత్రి తెలిపారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఢిల్లీ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీలంక మంత్రి హెరాత్ మాట్లాడుతూ..భారతదేశంతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక శ్రీలంక మొదటి దౌత్య పర్యటన భారతదేశంలో జరిగిందని, అక్కడ తాము ద్వైపాక్షిక సహకారంపై అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నామని తెలిపారు. కొలంబో పార్లమెంటులో బడ్జెట్ కేటాయింపుల చర్చపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ విదేశాంగ మంత్రి విజిత హెరాత్ ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సాంపూర్ సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభంతో పాటు, అనేక కొత్త అవగాహన ఒప్పందాలపై సంతకం చేస్తామని హెరాత్ చెప్పారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నప్పుడు తాము ఎవరి పక్షం వహించకుండా తమ విదేశాంగ విధానంలో తటస్థంగా ఉంటామని హెరాత్ అన్నారు.
