వన్య ప్రాణుల మాంసంలో మంకీపాక్స్‌ మూలాలు

Aug 21,2024 00:01 #Monkeypox
  • అనిశ్చితిలో ఆఫ్రికన్‌ ఆహారభద్రత

జెనీవా : అపరిశుభ్రమైన వన్య ప్రాణుల మాంసం (బుష్‌మీట్‌)లో మంకీపాక్స్‌ మూలాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గుర్తించింది.1970వ దశకంలో సెంట్రల్‌ ఆఫ్రికాలో కలుషితమైన అడవి జంతువుల మాంసం తినడం ద్వారా ఈ వ్యాధి మొదట సంక్రమించినట్లు గతేడాది ప్రచురితమైన ఒక అధ్యయన పత్రం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ధ్రువీకరించింది. జంతువుల ద్వారా లేదా కలుషితమైన జంతువుల మాసం ద్వారా కూడా వ్యాధి వ్యాపించే అవకాశం వుందని డబ్ల్యుహెచ్‌ఓ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే సబ్‌ సహారా ఆఫ్రికాలో అడవి జంతువుల మాంసమే వారికి ప్రధాన ఆహారం. దీనిని నిషేధిస్తే వారి ఆహార భద్రతే ప్రశ్నార్థకమవుతుంది. అదీగా అడవి జంతువుల మాంసం వారి ఆహారంలో విడదీయరాని భాగంగా మారింది. అటువంటపుడు జంతువులు, మానవుల మధ్య సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడమెలా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ప్రధానంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో మానవ వినియోగం కోసం వేటాడిన భూ సంబంధమైన అటవీ క్షీరదాల మాంసాన్నే బుష్‌ మీట్‌ అంటారు. . ఇటువంటి క్షీరదాలు మొత్తం క్షీరదాల్లో కేవం 1.8శాతమే వుండగా, 70శాతానికి పైగా ఇన్ఫెక్షన్లు దీని నుంచి ఉత్పన్నమవుతున్నాయి. సెంట్రల్‌ ఆఫ్రికా, పశ్చిమాఫ్రికా, ఆగేయాసియాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ మాంసం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.. ఈ మాంసాన్ని వినియోగించే టాప్‌ 10 దేశాల్లో ఈక్విటోరియల్‌ గినియా, గినియా-బిసావు, లైబేరియా, మలావి, సియర్రా లియోన్‌, లావోస్‌, ఉగాండా, వియత్నాం, కామెరూన్‌, ఐవరీ కోస్ట్‌ వంటివి వున్నాయి. గినియాలో బుష్‌ మీట్‌ అమ్మకాలను పరిమితం చేసేందుకు ఇటీవల కొన్ని చర్యలు ప్రకటించినా అవిపెద్దగా ఫలించలేదని ఆ అధ్యయనం పేర్కొంది. సెంట్రల్‌ ఆఫ్రికాలోని పలు దేశాల్లో పెంపుడు జంతువులు, పశు సంపద చాలా చాలా తక్కువగా వుంటుంది. అందువల్లే వారి ఆహార భద్రతలో బుష్‌ మీట్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆఫ్రికా జనాభా పెరుగుతున్నందున దీనికి డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ప్రతి ఏడాది సెంట్రల్‌ ఆఫ్రికాలో 50 నుండి 60లక్షల టన్నుల అటవీ జంతువుల మాంసం తింట్నుట్లు వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ తెలిపింది. బుష్‌మీట్‌ను నిషేధించడం లేదా వారి వ్యవహార శ్లైలిలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించడం వల్ల ఎలాంటి ఉపయోగం వుండదని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. అయితే అడవుల నరికివేతను నిరోధించడం వల్ల సుదూర భవిష్యత్తులో అడవి జంతువుల మాంసం (బుష్‌మీట్‌) వల్ల వచ్చే సంబంధిత ఇన్ఫెక్షన్లు, వ్యాధులు నివారిచడానికి అవకాశాలు వుంటాయని ఆ పత్రం పేర్కొంది.

➡️