గాజా : గతేడాది అక్టోబరు 7 నుండి గాజాలో ఇజ్రాయిల్ ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 30,800మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక పత్రికా సమావేశంలో వెల్లడించింది. గత 24 గంటల్లో ఇజ్రాయిల్ సైన్యం 83మంది పాలస్తీనియన్లను హతమార్చగా, 142మందిని గాయపరిచిందని తెలిపింది. ఈ యుద్ధంలో గాయపడిన వారి సంఖ్య 72,298కి పెరిగిందని పేర్కొంది. దెర్ అల్ బాలా నగరంలో అల్ అక్సా ఆస్పత్రికి గత 24గంటల్లో 45 మృత దేహాలు వచ్చాయని, డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు వచ్చారని వైద్య వర్గాలు తెలిపాయి. బాధితుల్లో ఎక్కువమంది పిల్లలు, మహిళలేనని, ఇంకా శిధిలాల్లో కొన్ని మృతదేహాలు అలాగే పడి వున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రిలో సకాలంలో వైద్య సాయం అందక, అవసరమైన వనరులు లేక గాయపడిన వారిలో చాలామంది మరణించారని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఇజ్రాయిల్ సైనికులు 587మంది మరణించగా, 3,053మంది గాయపడ్డారని ఇజ్రాయిల్ ఆర్మీ బుధవారం తెలిపింది.
