సూడాన్‌ లో డార్ఫర్‌ దాడులు – 300 మందికిపైగా మృతి

సూడాన్‌ (ఆఫ్రికా) : ఆఫ్రికా దేశంలోని సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు ఇటీవల దాడులకు తెగబడిన విషయం విదితమే. ఈ దాడుల్లో దాదాపు 300 మందికి పైగా మఅతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. జామ్జామ్‌, అబూషాక్‌ శిబిరాలపై గతవారం ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు దాడులకు పాల్పడ్డాయి. ఇందులో 300 మందికి పైగా పౌరులు చనిపోయారని ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌ పేర్కొంది. మఅతుల్లో 10 మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. వారు జామ్జామ్‌ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తుండగా ప్రాణాలు విడిచినట్లు తెలిపింది. మరణించినవారిలో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక, యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముంగిచాలని, పౌరులకు, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. కాగా.. 16 వేల మంది పౌరులు జామ్జామ్‌ శిబిరాన్ని వీడినట్లు తెలుస్తోంది. 2023 ఏప్రిల్‌లో సూడాన్‌ ఆర్మీ చీఫ్‌ అబ్దుల్‌ ఫత్తా అల్‌-బుర్హాన్‌ మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ కమాండర్‌ మొహమ్మద్‌ హమ్దాన్‌ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సుడానీస్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ ల మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోటి మందికి పైగా సూడాన్‌ను వదిలివెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

➡️