ఆక్రమిత ప్రాంతాలనుండి వైదొలగండి

ఐరాస జనరల్‌ అసెంబ్లీ డిమాండ్‌
న్యూయార్క్‌ : పాలస్తీనా భూభాగాల్లో అక్రమ ఆక్రమణలకు స్వస్తి చెప్పి 12 మాసాల్లోగా వారి భూభాగాల నుండి ఇజ్రాయిల్‌ వైదొలగాలని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 124 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14ఓట్లువచ్చాయి. 43మంది గైర్హాజరయ్యారు. ఈ తీర్మానం ఆమోదించడాన్ని చారిత్రకమైనదిగా పాలస్తీనా ప్రతినిధివర్గం ప్రశంసించింది. ఈ ఏడాది కొత్తగా వచ్చిన హక్కుల కింద పాలస్తీనా ఈ తీర్నానాన్ని మొదటగా ప్రవేశపెట్టింది. తన ప్రవర్తనను మార్చుకునేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ సమాజాన్ని, చారిత్రక ఐసిజె రూలింగ్‌ను ఉపయోగించుకోవడమే ఈ తీర్మానం వెనుకగల ఉద్దేశమని పాలస్తీనా రాయబారి రియాద్‌ మన్సూర్‌ వ్యాఖ్యానించారు. ఈ చర్యను స్వాగతిస్తున్నామని హమాస్‌ పేర్కొంది. పాలస్తీనా ప్రజల పోరాటాలకు అంతర్జాతీయ సమాజం సంఘీభావాన్ని ఇది తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది.

➡️