వాషింగ్టన్ డిసి : అమెరికా అధ్యక్షులు ట్రంప్ సలహాదారు ఎలన్ మస్క్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని బెదిరించారు. సైనిక సమాచార మార్పిడిలో కీలకమైన తన స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ని నిలిపివేస్తే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న మారణహోమం తనని బాధపెడుతోందని ఆదివారం సోషల్‌మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ ప్రతిష్టంభనలో ఉక్రెయిన్ తప్పనిసరిగా ఓటమి పాలవుతుందని అన్నారు. జెలెన్‌స్కీతో ప్రత్యక్షంగా పోరాటం చేయాలని తాను పుతిన్‌కు సవాలు విసిరానని అన్నారు.
ఉక్రెయిన్‌కి వెన్నెముక అయిన తన స్టార్ లింక్ నెట్‌వర్క్‌ని నిలిపివేస్తే ఆ దేశ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారు. సంవత్సరాల పాటు కొనసాగుతున్న మారణహోమం తనకు బాధకలిగించిందని అన్నారు. ఎవరైతే వాస్తవంగా శ్రద్ధ వహిస్తారో, ఆలోచిస్తారో, అర్థం చేసుకుంటారో వారు ఈ కసాయి దాడులు నిలిచిపోవాలని కోరుకుంటారని అన్నారు. ఇప్పుడు శాంతి కావాలని అన్నారు.
వైట్ హౌస్ ఎదుట ప్రదర్శనకారులు భారీ ఉక్రెయిన్ జెండాను ఎగురవేయడంపై స్పందిస్తూ.. టాప్10ఉక్రెయిన్ ఒలిగార్క్ (బిలియనీర్స్)లపై ముఖ్యంగా మొనాకోలో ఉన్నవారిపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. డెమోక్రాట్ల చర్యలకు నిధులు అందిస్తుందని వారేనని అన్నారు.