హిండెన్‌బర్గ్‌ మూత

  • నాథన్‌ అండర్సన్‌ సంచలన నిర్ణయం
  • లక్ష్యం పూర్తయ్యిందని ప్రకటన
  • ఎవరికీ బెదరలేదని వెల్లడి
  • 2017లో పది మందితో న్యూయార్క్‌లో ప్రారంభం
  • అదానీ అక్రమాలను ఎండగట్టిన సంస్థ

న్యూఢిల్లీ : అదానీ గ్రూపు అక్రమాలు, డొల్ల కంపెనీలపై సంచలన రిపోర్ట్‌ను విడుదల చేసిన అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు హిండెన్‌బర్గ్‌ వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ ఒక లేఖలో స్పష్టం చేశారు. దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ”గతేడాది నుంచి నేను నా కుటుంబం, స్నేహితులు, మా బృందంతో చర్చించి, హిండెన్‌
బర్గ్‌ రీసెర్చ్‌ కార్యకలాపాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాను. మేము చేస్తోన్న పనులకు సంబంధించిన ఐడియాలు, లక్ష్యం పూర్తి కావటంతో ఈ నిర్ణయానికొచ్చాం. దీని వెనక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవు” అని అండర్సన్‌ వివరించారు. తన బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతానన్న ఆయన.. ఇక తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతానని చెప్పారు.
హిండెన్‌బర్గ్‌ సంస్థను 2017లో పది మంది ఉద్యోగులతో అండర్సన్‌ ప్రారంభించారు. అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా ఇది పని చేస్తోంది. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తెలిపింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలలో జరిగే అవకతవకలు, మోసాలను గుర్తించటం, పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను విశ్లేషించటం పనిగా పెట్టుకుంది. ఈ కంపెనీ షార్ట్‌ సెల్లింగ్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలు భారత్‌, యారోపియన్‌ దేశాల్లో, ఇతర ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌లోనూ సంచలనంగా మారింది.

హిండెన్‌బర్గ్‌ సంస్థకు 60కి పైగా దేశాల్లో నెట్‌వర్క్‌ ఉంది. ఈ దేశాల్లోని మాజీ టాప్‌ బ్యూరోక్రాట్లు, కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగులు, ఆర్థిక సంస్థలతో హిండెన్‌బర్గ్‌కు మంచి సంబంధాలున్నాయి. కంపెనీల్లో జరిగే ఆర్థిక అవకతవకలను గుర్తించటంలో అండర్సన్‌కు మంచి పట్టు ఉంది. కార్పొరేట్‌ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకొనే బెర్నీ మడాఫ్‌ మోసపూరిత లావాదేవీల గుట్టును విప్పిన వారిలో ఒకరైన హరీ మార్కోపోలోస్‌తో కలిసి అండర్సన్‌ ప్లాటినం పార్ట్‌నర్స్‌ అనే సంస్థపై దర్యాప్తు కోసం కలిసి పని చేశారు. ఇదే సమయంలో షార్ట్‌ సెల్లింగ్‌, పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను విశ్లేషించడం, ఆర్థిక మోసాల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాతే హిండెన్‌బర్గ్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు.

అదానీ గ్రూపు అతలాకుతలం..

ప్రధానీ నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు సామ్రాజ్యాన్ని హిండెన్‌బర్గ్‌ భారీ కుదుపునకు గురి చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూపు ఆర్థిక వ్యవహారాలు, అప్పులు, స్టాక్‌ మ్యానిప్యులేషన్‌ గురించి సంచలన నివేదికను బయట పెట్టింది. ఆ రిపోర్ట్‌ దెబ్బకు 2023 జనవరిలో దేశ రాజకీయ, ఆర్థిక వ్యవహారాలనూ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా అదానీపై తీవ్ర చర్చకు దారి తీసింది. అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ ఏకంగా రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది. అదానీ సంస్థల్లో ఆయా కంపెనీల పెట్టుబడులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసి కొన్న వాటాలపై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్‌ దెబ్బతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ స్థానం కూడా పడిపోయింది. దీంతో ఇతర బడా వ్యాపార సంస్థలకు వణకుపుట్టింది. అదానీ అక్రమాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మద్దతును ఇస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డిఎ ప్రభుత్వం ఇరుకున పడింది. పార్లమెంటులో అదానీ అంశం పైనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టిన విషయమూ తెలిసిందే. అయితే, అదానీ గ్రూపు హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. గతేడాది ఆగస్టులోనూ హిండెన్‌బర్గ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియ(సెబీ) చైర్‌పర్సన్‌ మాధవి బచ్‌, ఆమె భర్త దావల్‌ బచ్‌ల పైనా ఆరోపణలు చేయటం, అది కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

➡️