వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో బుధవారం నుండి మూడు రోజుల పాటు నాటో యుద్ధ సదస్సు వాషింగ్టన్‌లో జరగనున్న నేపథ్యంలో వైట్ హౌస్‌కు నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఈ సదస్సులో ప్రత్యేకించి ఉక్రెయిన్‌పై తమ ఆలోచనలను నాటో కూటమి చర్చించనుంది. రష్యాను బలహీనపరిచేంతవరకు యుద్ధం కొనసాగించాలని నాటో భావిస్తోంది. చర్చలకు వెళ్లరాదని నాటో ఇప్పటికే ఉక్రెయిన్‌ను ఆదేశించింది. నాటో యుద్ధాలకు వ్యతిరేకంగా సదస్సుకు రెండు మూడు రోజుల ముందు నుంచే నిరసనల తాకిడి మొదలైంది. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ ఎదుట ప్రదర్శనలు చూస్తుంటే ఉక్రెయిన్ యుద్ధం పట్ల, ఇంకా అనేక ఇతర అంశాల పట్ల ప్రజాభిప్రాయం ఎలా వుందో స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి చెప్పేందుకు తక్షణమే చర్చలు జరగాలని 68శాతం మంది అమెరికన్లు కోరుకుంటున్నారని ఇటీవలే ఎకనామిస్ట్ పోల్‌లో వెల్లడైంది. నాటో 75వ వార్షికోత్సవం పేరుతో కూటమి సమావేశాలు జరుపుతున్నప్పటికీ వారి అసలు లక్ష్యం ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కొనసాగించేలా చూడడమే. ఈ పరిస్థితుల్లో ఆదివారం వాషింగ్టన్ డిసిలో రోజంతా నిరసనలు, ఆందోళనలు కొనసాగగా, సోమవారం వైట్‌హౌస్ ఎదుట జరిగాయి. వివిధ గ్రూపులకు చెందినవారు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం ఉక్రెయిన్‌పై సమావేశం వుంటుందని దీనికి ఉక్రెయిన్‌్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హాజరవుతారని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బే వైట్‌హౌస్ పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఉక్రెయిన్‌కు మద్దతును, సాయాన్ని పెంచడానికి ఈ వారాంతంలో నాటో కూటమి దేశాలు పలు ప్రకటనలు చేస్తాయని కిర్బే తెలిపారు.
