- 30 మంది గల్లంతు
ఖాట్మాండు : నేపాల్‌లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. 192 మంది చనిపోయారు. కనీసం 30 మంది గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం వరుసగా మూడోరోజైన సోమవారం కూడా రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగించాయి. నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 192 మంది చనిపోయి ఉంటారని హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి రిషిరామ్ తివారీ తెలిపారు. 194 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం సింఘా దర్బార్‌లోని ప్రధాని కార్యాలయంలో నేపాల్ ప్రధానమంత్రి కెపి ఓలి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విపత్తు సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్‌ని మరింత పెంచాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో నేపాల్ ఆర్మీ, పోలీసులు, సాయుధ పోలీసు సిబ్బంది మొత్తం 4,500 మంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగమై ఉన్నారని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. భారత్ నుంచి వచ్చే కూరగాయల్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ మార్కెట్‌లో వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లు, వందలాది ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్లే అన్ని మార్గాలు బ్లాక్ చేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని ‘ఖాట్మాండు పోస్టు’ అనే వార్తా పత్రిక తెలిపింది. రవాణాను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రిత్వశాఖ అధికారి తివారీ తెలిపారు.