- ఆస్ట్రియా చాన్సలర్‌తో మోడీ భేటీ
వియన్నా : భారత్, ఆస్ట్రియాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు గల కొత్త అవకాశాలను గుర్తించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. రాబోయే దశాబ్ద కాలంలో సహకారానికి బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సంబంధాలకు వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మాస్కోలో రెండు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి వియన్నా చేరుకున్న మోడీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కర్ల్ నెహమర్‌తో చర్చలు జరిపారు. అనంతరం నెహమర్‌తో కలిసి మోడీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తమ చర్చలు అర్ధవంతంగా సాగాయని మోడీ చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, పశ్చిమాసియాలో పరిస్థితులతో సహా ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న వివాదాలన్నింటిపై సవివరంగా చర్చించినట్లు చెప్పారు. యుద్ధానికి ఇది సమయం కాదని ఈ సందర్భంగా మోడీ పునరుద్ఘాటించారు. సమస్యలకు పరిష్కారాలు యుద్ధ రంగంలో లభించవన్నారు. చర్చలు, దౌత్యంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నొక్కి చెప్పారు. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా ఆమోదయోగ్యం కాదని, సమర్ధించలేమని మోడీ పేర్కొన్నారు. గత 40ఏళ్ళలో భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే మొదటిసారి.