- జైలులోనే విచారణ
ఇస్లామాబాద్: కొత్త తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీపై కోర్టు అభియోగాలను మోపింది. ఇమ్రాన్ ఖాన్ పై కత్తిగట్టిన పాక్ ప్రభుత్వం ఆయనను శాశ్వతంగా జైలులో ఉంచేందుకు ఒక కేసు తరువాత మరో కేసు బనాయిస్తున్నది. ఇమ్రాన్ దంపతులపై దాఖలైన తోషఖానా కేసుల పరంపరలో ఇది మూడవది. మొత్తంగా బనాయించిన కేసుల్లో ఏడవది. గత సంవత్సరం మే9న నిరసనల సందర్భంగా ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్‌పై దాడికి సంబంధించి పిటిఐ వ్యవస్థాపకుడు, ఇతర పార్టీ నాయకులపై అభియోగాలు మోపిన వారం రోజులకే ఈ కొత్త తోషఖానా కేసును తెరపైకి తెచ్చారు. గత ఏడాది ఆగస్టు5న ఇమ్రాన్‌ను అరెస్టు చేసినప్పటి నుండి ఆయనను జైలు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయరాదన్న దాంతో వరుస కేసులు పెట్టారు. ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ ఇతర కేసుల్లో శిక్ష పడి అడియాలా జైలులోనే ఆయన ఉండాల్సి వచ్చింది. ఖరీదైన ఆభరణాలను అతి తక్కువ రేటుకు కొనుగోలు చేయడం ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఇమ్రాన్‌పై మోపిన తాజా అభియోగం. ఈ కేసులో విచారణను ఇమ్రాన్ ఉంటున్న అడియాల జైలులోనే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారూఖ్ అర్జుమండ్ గురువారం నిర్వహించారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ తన న్యాయవాదితో కలసి హాజరయ్యారు. ప్రభుత్వం మోపిన తాజా అభియోగాలను ఇమ్రాన్, బుష్రా ఇరువురూ తోసిపుచ్చారు. దీనిపై వాంగ్మూలాలను నమోదు చేసేందుకు ఈ నెల 18న కోర్టుకు రావాల్సిందిగా సాక్షులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇంతకుముందు 2023 మే10న మొదటి తోషఖానా కేసు ఆయనపై నమోదయింది. రెండవ తోషఖానా కేసు జనవరిలో నమోదయింది. ఫిబ్రవరిలో 19 కోట్ల పౌండ్ల అవినీతికి సంబంధించి మరో కేసు నమోదయింది. ఇటీవల సైనిక హెడ్ క్వార్టర్‌పై దాడి కేసు బనాయించారు. ఇమ్రాన్‌పై ఇంతకుముందు నమోదయిన రెండు తోషఖానా కేసులూ సస్పెండయ్యాయి. . కొత్త తోష్‌ఖానా కేసు కూడా అంతిమ దశకు చేరుకుంది. ఇమ్రాన్ దంపతులిరువురూ అకౌంటబులిటీ కోర్టు ఎదుట ఈ వారం తమ వాదనలు వినిపించనున్నారు. ఇమ్రాన్ తరపు న్యాయవాది గత నెలలో విచారణ సందర్భంగా ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తోషఖానా పాలసీకి అనుగుణంగానే కానుకలను స్వేకరించారని అన్నారు. జులై 13న ఇద్దత్ కేసులో నిర్దోషులుగా వీరు బయటపడిన మరుసటి రోజే కొత్త తోషఖానా కేసు కింద వారిని తిరిగి జైలులో పెట్టారు