- మొసాద్ కోవర్టు అపరేషన్ గుట్టు రట్టు
- బయటపెట్టిన వాషింగ్టన్ పోస్టు కథనం
వాషింగ్టన్ : హిజ్బుల్లా ఫైటర్లు ఉపయోగించే పేజర్లను పేలుడు పదార్ధాలుగా మార్చడానికి ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ గుట్టును వాషింగ్టన్ పోస్ట్ బట్టబయలు చేసింది. ఈ మేరకు ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. ఆ కథనం ప్రకారం, హిజ్బుల్లా కమాండర్లు, ఫైటర్లు ఉపయోగించే పేజర్లలో మొసాద్ పేలుడు పదార్ధాలను చొప్పించింది. లెబనాన్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలిన ఈ పేజర్ల వల్ల మూడు వేల మందికి పైగా హిజ్బుల్లా కార్యకర్తలు మరణించారు. తామెంతగానో విశ్వసించే ఈ పేజర్లను ఇజ్రాయిల్ బాంబులతో నింపేసిందని వారికేమాత్రం తెలియదు.
తన సభ్యుల మధ్య సమాచార మార్పిడికి గానూ నమ్మకమైన కమ్యూనికేషన్ సాధనాలు కావాలని హిజ్బుల్లా 2022లో భావించింది. ఆ సమయంలో ఇజ్రాయిల్ సంస్థ అపోలో ఎఆర్924 పేజర్లను ప్రవేశపెట్టింది. ఈ పేజర్ కొంచెం పెద్దదిగా వున్నప్పటికీ వాటర్‌ప్రూఫ్ సామర్ధ్యం కలిగి వుంటుంది. అదీగాక దీనికి గల పెద్ద బ్యాటరీ, నెలల తరబడి చార్జింగ్ చేయకపోయినా పనిచేసేలా వుంది. వీటన్నింటికన్నా తమ శత్రువు వాటిని కనిపెట్టలేరని హిజ్బుల్లా భావించింది. దాంతో ఏకంగా ఐదు వేల పేజర్లను కొనుగోలు చేసింది. మధ్యస్థాయి ఫైటర్లకు, సపోర్ట్ సిబ్బందికి ఫిబ్రవరిలో అందజేసింది. ఆ పేజర్లలో పేలుడు పదార్థాలు దాగి వున్నాయని, వాటిని ఉపయోగించడానికి సిద్ధపడగానే పేలిపోతాయని వారికి తెలియదు. అన్నిటికంటే ఈ పేజర్లను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు రెండు చేతులతో ఆపరేట్ చేయాల్సి వచ్చేలా రెండంచెల డీ ఎన్‌క్రిప్షన్ పద్థతిని అమలు చేశారు. ఫలితంగా వేలాదిమంది హిజ్బుల్లా ఫైటర్లు, మరికొంతమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా అమలు చేయడంతో ఒక ఇంటెలిజెన్స్ సంస్థ, శత్రువును ఎదుర్కొన్న తీరు ఇటీవలి చరిత్రలో సంచలనం సృష్టించింది.
ఈ ఆపరేషన్ గురించి అనేక కొత్త విషయాలు బయటపడ్డాయి. ఇజ్రాయిల్, అరబ్, అమెరికా భద్రతా అధికారులు, రాజకీయ నేతలు, దౌత్యవేత్తలు ఇలా పలువురు ఇందుకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. లెబనాన్ అధికారులు, హిజ్బుల్లాకు సన్నిహితులు కూడా మరికొంత సమాచారాన్ని అందించారు. పేరు వెల్లడించకూడదనే షరతుపై అత్యంత సున్నితమైన ఈ నిఘా వ్యవహారం గురించి చర్చించారు. మొసాద్ ప్రధాన కార్యాలయంలో ఇందుకోసం ఏళ్ల తరబడి ప్రణాళికలు రూపొందించారు. పలు దేశాల్లో ఇందుకోసం మరికొంతమంది పనిచేశారు. ఈ కుట్ర వల్ల హిజ్బుల్లాకు చెందిన వేలాదిమంది కార్యకర్తలను హతమార్చడమే కాకుండా ఉన్నత నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత విస్తరించడానికి కారణమైంది. ఇక వైమానిక దాడులు, ఆ తర్వాత నెమ్మదిగా భూతల దాడులతో హిజ్బుల్లాను క్షేత్ర స్థాయిలో తుడిచిపెట్టేయవచ్చని ఇజ్రాయిల్ పాలకవర్గం భావించింది. మొత్తంగా ఈ కుట్రకు 2022లోనే తెర తీసినా, అక్టోబరు 7నాటి దాడులకు సరిగ్గా ఏడాది ముందుగానే ఈ కుట్రలోని కొన్ని భాగాల అమలు ప్రారంభమైంది. ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో సిద్ధహస్తులైన మొసాద్ వ్యూహకర్తలు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణల ద్వారా, వేగుల ద్వారా శత్రు శిబిరంలోని కీలక సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించారు. ఇక ఆ తర్వాత శత్రువుకు నమ్మకం కలిగించేలా కమ్యూనికేషన్ పరికరాలను రూపొందించడంపై దృష్టి పెట్టారు. దీనికి బీజం 2015లోనే పడింది. తొలుత వాకీటాకీలను లెబనాన్‌లోకి చొప్పించిన మొసాద్, పెద్ద సైజు బ్యాటరీతో టూ వే రేడియో కలిగిన మొబైల్‌లో పేలుడు పదార్థాలు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను దాచివుంచారు. ఈ పరికరాలతో హిజ్బుల్లా సమాచారమంతా ఇజ్రాయిల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇలా తొమ్మిది సంవత్సరాలు హిజ్బుల్లాపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన మొసాద్ వాకీటాకీలను బాంబులుగా మార్చే అవకాశాన్ని అట్టిపెట్టుకుంది. ఈలోగా కొత్త అవకాశం వచ్చింది. పేజర్లు శక్తివంతమైన పేలుడు పదార్ధాలుగా మారాయి.
ఇజ్రాయిల్ విద్రోహ చర్యల గురించి అనుమానాలు వున్న హిజ్బుల్లా ఇజ్రాయిల్‌తో సంబంధమున్న ఏ దేశం నుండి కూడా ఏవీ కొనుగోలు చేయరాదని భావిస్తున్న తరుణంలో ఇజ్రాయిల్‌తో, అలాగే యూదు ప్రయోజనాలతో ఏ మాత్రం సంబంధం లేని, పైగా మంచి గుర్తింపు కలిగిన తైవాన్ బ్రాండ్ అపోలో పేజర్ల కొనుగోలు కోసం 2023లో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. ఆ కంపెనీకి కూడా ఈ ప్రణాళిక గురించి ఏ మాత్రమూ తెలియదు. తైవాన్ నుండి వచ్చిన పేజర్లు ఇజ్రాయిల్‌లో అసెంబుల్ అయి లెబనాన్ చేరాయి.