మతోన్మాద కోణం లేదు, కేవలం రాజకీయాలే

  • బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసపై పోలీసుల నివేదిక

ఢాకా : గతేడాది ఆగస్టులో ప్రధాని షేకహేసీనా వైదొలగిన తర్వాత మొత్తంగా 1769 మతోన్మాద దాడులు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్‌ హిందూ బుద్ధిస్ట్‌ యూనిటీ కౌన్సిల్‌ ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్‌ పోలీసులు ఒక నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. వీటిల్లో మెజారిటీ కేసుల్లో మతోన్మాదం కోణం లేదని, కేవలం రాజకీయ స్వభావంతో కూడినవేనని పేర్కొన్నారు. 1234 సంఘటనలు పూర్తిగా రాజకీయ కోణంతో కూడినవేనని, కేవలం 20 సంఘటనలు మాత్రమే మతోన్మాదంతో కూడినవని పోలీసుల నివేదిక పేర్కొంది. మరో 161 ఫిర్యాదులు తప్పుడివగా తేలిందని నివేదిక తెలిపింది. హింసకు లక్ష్యాలుగా మారిన వారితో పోలీసులు మాట్లాడారని, కౌన్సిల్‌ తన నివేదికలో ప్రస్తావించిన ప్రతి ప్రదేశం, వ్యక్తి, సంస్థలను పోలీసులు సందర్శించారని, పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సిందిగా అందరినీ కోరినట్లు చెప్పారు. అటువంటి వారందరికీ తగు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. దర్యాప్తులో వెల్లడైన నిర్ధారణలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెజారిటీ కేసుల్లో దాడుల వెనుక ఎలాంటి మతోన్మాద కుట్ర కోణాలు లేవని, కేవలం రాజకీయ స్వభావంతో కూడినవేనని పోలీసులు తేల్చారు. మొత్తంగా 35మందిని అరెస్టు చేశారు. 1769 ఆరోపణలు రాగా ఫిర్యాదులను బట్టి పోలీసులు 62కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో మతోన్మాద హింస చెలరేగితే సహించేది లేదని ప్రొఫెసర్‌ మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. హసీనా ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో పోలీసు పాలనా వ్యవస్థ కూడా కుప్పకూలింది. దీంతో హిందూ బౌద్ధిస్ట్‌ యూనిటీ కౌన్సిల్‌ చొరవ తీసుకుని తమ దృష్టికి వచ్చిన సంఘటనలను, ఆరోపణలను నమోదు చేసింది.

➡️