Nobel Peace Prize: జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి

స్టాకహేోం : నోబెల్‌ శాంతి బహుమతి జపనీస్‌ సంస్థ ‘నిహాన్‌ హిడాంకియో’కు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను నివారించడంలో ఆ సంస్థ చేస్తున్న కృషికి గాను ఈ బహుమతిని ప్రకటించినట్లు స్వీడిష్‌ నోబెల్‌ కమిటీ శుక్రవారం తెలియజేసింది.
హిరోషిమా, నాగసాకిల్లో అణుబాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన బాధితుల ఉద్యమం నుంచి ఈ సంస్థ రూపుదిద్దుకుంది. ఈ సంస్థను హిబాకుషా అని కూడా పిలుస్తారు. అణ్వాయుధాలు లేదని ప్రపంచాన్ని సాధించడానికి, అణ్వాయుధాలను మళ్లీ ప్రయోగించకుండా ఉండేలా దేశాలను అప్రమత్తం చేసేందుకు ఈ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. వెలకట్టలేని తమ అనుభవాల ద్వారా శాంతి కోసం యత్నిస్తున్న బాధితులను ఈ శాంతి బహుమతితో సత్కరిస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
వర్ణించలేని బాధను వివరించేందుకు, అనూహ్యమైన ఘటనల గురించి ఆలోచించడానికి, అణ్వాయుధాల వలన కలిగే అపారమైన నష్టాన్ని, బాధను గ్రహించడానికి వారి అనుభవాలు సహాయపడతాయని తెలిపింది. సుమారు 80 ఏళ్లుగా యుద్ధంలో ఎలాంటి అణ్వాయుధాలను వినియోగించలేదని కమిటీ ఉద్ఘాటించింది. అణ్వాయుధాల ప్రయోగం నిషిద్ధం కోసం నిహాన్‌ హిడాంకియో చేసిన కృషిని గుర్తిస్తూ.. నోబెల్‌ కమిటీ కూడా అణ్వాయుధాలను ప్రయోగించకూడదన్న అంశాన్ని పునరుద్ఘాటించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న సమయంలో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబును ప్రయోగించిన సంగతి తెలిసిందే.

➡️