రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న పోరులో రష్యాకు మద్దతుగా తన బలగాలను పంపినట్లు ఉత్తర కొరియా తొలిసారిగా ధృవీకరించింది. కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం ఆధీనంలో ఉన్న రష్యన్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో తమ దళాలు దోహదపడ్డాయని తెలిపింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ)కి సోమవారం అందించిన ఒక ప్రకటనలో పేర్కొంది. పాలక వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్, మాస్కో మరియు ప్యోంగ్యాంగ్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగా ఆ దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యన్ దళాలతో పాటు యుద్ధానికి తమ దళాలను పంపారని తెలిపింది. ఉక్రెయిన్ నయా-నాజీ ఆక్రమణదారుల విధానాలను అమలు చేస్తూ ఆక్రమించిన కుర్స్క్ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి రష్యన్ సాయుధ దళాలకు సహకరిస్తూ సైన్యాన్ని మోహరించామని తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ గత సంవత్సరం జూన్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాలు సైనికపరంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుకు రావాలని హామీ ఇచ్చారు.
