- మాక్రాన్ పై లెఫ్ట్ విమర్శ
పారిస్: ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయినా, ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే అధ్యక్షుడు మాక్రాన్ కొత్త ప్రధాని నియామకంపై జాప్యం చేస్తున్నారని వామపక్షాలు విమర్శించాయి. మాక్రాన్ విధానాలు ఇక చెల్లవని అవి హెచ్చరించాయి. అంతకుముందు రోజే ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఓ టీవి చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పారిస్ ఒలింపిక్స్ పూర్తయ్యేదాకా కొత్త ప్రధాని నియామకం చేపట్టబోనని చెప్పారు. క్రీడలు విజయవంతంగా నిర్వహించాలంటే ప్రభుత్వ సుస్థిరత చాలా అవసరమని ఆయన చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి 10,500 క్రీడాకారులు, ఇంకా వేలాది మంది క్రీడాభిమానులు వస్తున్నందున ఇప్పుడు ప్రధానిని మార్చితే అంతా గందరగోళమవతుందని అన్నారు. ఒలింపిక్స్ సమీపించే దాకా ప్రధాని నియామకాన్ని జరపకుండా ఇప్పుడు క్రీడలను సాకుగా చూపుతున్నారని మాక్రాన్‌పై లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలు ప్రధాని పదవికి 37 ఏళ్ల ఆర్థిక వేత్త, పారిస్ సిటీ కౌన్సిల్ సీనియర్ అధికారి లూసీ కేస్టెట్స్ పేరును ఎప్పుడో సూచించాయి. అయినా మాక్రాన్ తేల్చకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని లూసీ చెప్పారు. మాక్రాన్ పన్నుల అక్రమాలపై తమ పోరాటం సాగుతుందని ఆమె చెప్పారు. మొన్నటి ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో వామపక్షాలు, ప్రగతి శీల శక్తులతో కూడిన న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) అతి పెద్ద కూటమిగా అవతరించిన సంగతి తెలిసిందే.