Pakistan: రైలు హైజాక్‌

  • బందీలుగా 182 మందికి పైగా ప్రయాణికులు
  • ఆపరేషన్‌లో 20 మంది సైనికుల మృతి
  • బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పంజా

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని వాయవ్య బెలూచిస్తాన్‌లో ప్రయాణికుల రైలును సాయుధ తీవ్రవాదులు మంగళవారం హైజాక్‌ చేశారు. 182మందికి పైగా ప్రయాణికులన బందీలుగా తీసుకున్నారు. రైలు డ్రైవర్‌ను గాయపరిచారని అధికారులు తెలిపారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు రైలు ప్రయాణిస్తుండగా, బోలన్‌ జిల్లాలో ఈ దాడి జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్‌ రిండ్‌ తెలిపారు. డ్రైవర్‌ గాయపడడంతో నిర్జన ప్రాంతంలో రైలు ఆగిపోయిందని చెప్పారు. కాగా సైనిక బలగాలు సంఘటనా ప్రాంతానికి చేరగా.. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో 20 మంది సైనికులు చనిపోయారని మీడియా కథనాలు వస్తు న్నాయి. బందీలను విడిపించుకోవటానికి పాక్‌ ప్రభుత్వం ఎయిర్‌ స్ట్రైక్‌కు రంగం సిద్ధం చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే రైలులో ప్రయాణికుల పరిస్థితి ఎలా వుందో వెంటనే తెలియరాలేదు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో రైలు క్వెట్టా నుంచి బయలుదేరింది. పెషావరకు చేరుకోవడానికి 30 గంటలకు పైగా పడుతుంది. పాకిస్తాన్‌లో ఏండ్ల తరబడి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వేర్పాటువాద బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బిఎల్‌ఎ) ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటించింది. అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా బలూచిస్తాన్‌ ప్రభుత్వం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ రైలుకు 9 బోగీలు వున్నాయని, దాదాపు 500 మంది ప్రయాణికులు వుంటారని రైల్వే కంట్రోలర్‌ తెలిపారు. సొరంగం నెంబరు 8లో రైలును సాయుధులు ఆపేశారు. ట్రాక్‌ను పేల్చేసి..ఉగ్రవాదులు ట్రైన్‌ను హైజాక్‌ చేశారు. ప్రయాణికులు, సిబ్బందితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని కంట్రోలర్‌ చెప్పారు. సైనిక ఆపరేషన్‌ ప్రారంభిస్తే బందీలందరినీ ఊచకోత కోస్తామని ముందస్తుగా బిఎల్‌ఎ హెచ్చరించింది. ఈ రక్తపాతానికి పూర్తిగా ప్రభుత్వానిదే, సైన్యానిదే బాధ్యత అవుతుందని ప్రకటించింది. హోంమంత్రి మొహిసిన్‌ నక్వి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకులైన ప్రయాణికులపై దాడులు చేసిన వీరు ఎలాంటి క్షమాభిక్షకు అర్హులు కాదని విమర్శించారు.

➡️