- ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరుపై అమెరికా వాసుల ఆగ్రహం
- దేశవ్యాప్తంగా నిరసనలు
అట్లాంటా : రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, వాటిని అమలు చేస్తున్న తీరు పట్ల అమెరికా వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధమైన పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న వారిని అత్యంత అమానవీయంగా వారి స్వదేశాలకు పంపుతున్న తీరు పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరైన పత్రాలు లేవని లేదా క్రిమినల్ నేరాల్లో దోషులనే ఆరోపణలతో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలామందిని అరెస్టు చేస్తున్నారు. వారు నిజానికి ఎలాంటి నేరాల్లోనూ నిందితులు కాదు. అధికారులు దాడులు చేసి, రోజుకు దాదాపు 800 నుండి వెయ్యి మందిని అరెస్టు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మైగ్రెంట్లను నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారని, వారి ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) సోషల్‌మీడియా వేదికల ద్వారా తన ఆపరేషన్ గురించి చెబుతున్న వాటికి వాస్తవిక పరిస్థితులకు అసలు పొంతన లేదని చెబుతున్నారు. తుపాకులను కలిగి వున్నారని, మాదకద్రవ్యాలు వున్నాయని, హత్యలకు, లైంగిక దాడులకు పాల్పడ్డారని ఇలా క్రిమినల్ నేరాల ఆరోపణలతో ఈ తరలింపు ప్రక్రియ సాగుతోంది. గత వారం ఐసిఇ చేసిన అరెస్టులకు ఈ కేసులకు సంబంధమే లేదు. దీనిపై ఎన్‌బిసి న్యూస్ సోదాహరణలతో వార్తా కథనాలు అందజేసింది. ఎన్‌బిసి న్యూస్ ప్రకారం కేవలం 613 అరెస్టులు మాత్రమే క్రిమినల్ అరెస్టులుగా పరిగణించారని, మిగిలిన 566మందిలో 47శాతం మంది సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నవారని ఆ నివేదిక పేర్కొంది. వీరందరినీ కలిపి ఐసిఇ నిర్బంధ శిబిరాల్లో పెట్టి, ఆ తర్వాత వారిని వారి దేశాలకు అమానవీయ రీతిలో తరలిస్తున్నారని వివరించింది.