పాక్‌లో రాజకీయ అనిశ్చితి !

Feb 11,2024 11:07 #Pakistan, #Political, #uncertainty
  • ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీని అడ్డుకునేందుకు సైన్యం యత్నం
  • తెరపైకి నవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ సంకీర్ణం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. నేరుగా ఎన్నికలు నిర్వహించిన 264 పార్లమెంటు స్థానాలకు గాను 256 స్థానాల ఫలితాలు ఇప్పటివరకు వెల్లడి కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ బలపరిచిన ఇండిపెండెంటు అభ్యర్థులు 93 స్థానాలు గెలుచుకున్నారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ (ఎన్‌) కు 73 స్థానాలు రాగా, బిలావల్‌ జర్డారీ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి)కి 54 స్థానాలు దక్కాయి. ఇతర చిన్న పార్టీలకు 36 స్థానాలు లభించాయి. సర్వశక్తివంతమైన సైన్యాన్ని ఎదిరించి అనూహ్య విజయం సాధించిన ఇమ్రాన్‌ ఖాన్‌ బలపరిచిన ఇండిపెండెంట్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు అన్వేషిస్తున్నారు. యుద్ధాల్లో ఓడినా, ఎన్నికల్లో ఎన్నడూ ఓడని పాక్‌ సైన్యం ఇప్పుడు ఇమ్రాన్‌కు అధికారం దక్కకుండా చూసేందుకు నవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ జర్దారీ భుట్టోతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా పావులు కదుపుతోంది. అనిశ్చితిని తొలగించేందుకు విభేదాలను పక్కన పెట్టి ఆ రెండు పార్టీలు చేతులు కలపాలని సైన్యం కోరింది. దీనికి ఆ రెండు పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. ఎన్నికల్లో సైన్యం దన్నుతో పెద్దయెత్తున రిగ్గింగ్‌, అక్రమాలు, ఫలితాల తారుమారు వంటి అవకతవకలు చోటు చేసుకున్నాయని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. విదేశీ పరిశీలకులు కూడా ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

లండన్‌ ఫ్లాన్‌ ఫెయిల్‌ : ఇమ్రాన్‌

ఎన్నికల ఫలితాలు తారుమారవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పిటిఐ మద్దతుదారులు పెషావర్‌లోని తాత్కాలిక ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వెలుపల నిరసనలకు దిగారు. మొబైల్‌ సర్వీసులను నిషేధించడం సిగ్గు చేటైన విషయమని పిటిఐ విమర్శించింది. అర్ధరాత్రికల్లా మొత్తం ఫలితాలు ప్రకటించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఫలితాలను సకాలంలో ప్రకటించే రాజ్యాంగబద్ధమైన పాత్రను నిర్వర్తించడంలో పాక్‌ ఎన్నికల కమిషన్‌ విఫలమైందని విమర్శించింది. కేంద్రంలోనూ, పంజాబ్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌ల్లో తామే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జైలు నుండే పిటిఐ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన ఎఐ వాయిస్‌తో చేసిన విజయోత్సవ ప్రసంగం ఆడియో క్లిప్‌ను ఎక్స్‌లో విడుదల చేశారు. నవాజ్‌ షరీఫ్‌ అమలు చేయాలనుకున్న లండన్‌ ప్లాన్‌ విఫలమైందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొన్నారని అన్నారు.

దర్యాప్తుకు అమెరికా, బ్రిటన్‌, ఇయు విజ్ఞప్తి

పాక్‌ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు, మోసం జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తంగా ఆ ఎన్నికల ప్రక్రియపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం వుందని అమెరికా, బ్రిటన్‌, యురోపియన్‌ యూనియన్‌లు పిలుపిచ్చాయి. పాక్‌లో పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

➡️