అమెరికాలో మొదలైన పోలింగ్‌ !

  • ఓటు వేసిన హారిస్‌, ట్రంప్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఓటింగ్‌ మంగళవారం జరిగింది. పోలింగ్‌ సమయానికి వచ్చేసరికి రాష్ట్రానికి, రాష్ట్రానికి కొన్ని సార్లు కౌంటీకి, కౌంటీకి మధ్య కూడా తేడాలున్నాయి. నార్త్‌ డకోటా, న్యూహాంప్‌ షైర్‌లో పోలింగ్‌ ముగిసే సమయానికి కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ మొదలవుతుంది. చాలా రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు పోలింగ్‌ సాగింది. బుధవారం రాత్రికి గాని మొత్తం పోలింగ్‌ పూర్తి కాదు. క్యూలో నిల్చొన్న చివరి ఓటరు ఓటేసేవరకు పోలింగ్‌ కేంద్రం తెరిచే ఉంటుంది. పోలింగ్‌ ముగిసిన రాష్ట్రాల్లో తొలి ఎన్నికల ట్రెండ్స్‌ను బట్టి ట్రంప్‌, హారిస్‌ మధ్య నెక్‌ అండ్‌ నెక్‌ పోటీ నెలకొంది. కాబట్టి విజేత ఎవరో తెలుసుకోవడానికి ఎక్కువ సేపే ఎదురు చూడాల్సి ఉంటుంది. ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లో కూడా ఈ ఇరువురి అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా ఉన్నట్లు తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి. ట్రంప్‌ సొంతర రాష్ట్రమైన ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో తన ఓటు హక్కు వినియోగించుకోగా, హారిస్‌ కాలిఫోర్నియాలో ఓటు వేశారు. అలబామాలో సాంకేతిక పరమైన సమస్య తలెత్తడంతో పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయమేర్పడింది. మొత్తం 18.6కోట్ల మంది అర్హులైన ఓటర్లు వున్నారు. ముందస్తు ఓటింగ్‌ అవకాశాన్ని ఉపయోగించుకుని సోమవారం నాటికి 8.2కోట్ల మంది తమ ఓటు వేశారు. హారిస్‌ ఎన్నికైతే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు కానున్నారు. ప్రస్తుతం బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే దాదాపుగా కొనసాగించేలా హారిస్‌ ప్రతిపాదిత విధానాలు వున్నాయి. ఆర్థికాంశాల పట్ల ప్రజల ఆందోళనలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు ట్రంప్‌ తాను ఎన్నికైతే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలసవాదుల తరలింపు కార్యక్రమం చేపడతానని ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజేతను ప్రకటించడానికి నాలుగు రోజులు పట్టింది. అధికారాన్ని ప్రశాంతంగా బదిలీ చేయడానికి సహకరించాల్సిందిగా 47 రాష్ట్రాలు, మూడు అమెరికన్‌ కేంద్ర పాలిత ప్రాంతాల అటార్నీస్‌ జనరల్స్‌ విజ్ఞప్తి చేశారు.

➡️