ప్రముఖ కొరియన్‌ డ్రామా నటుడు సాంగ్‌ జే రిమ్‌ కన్నుమూత

సియోల్‌ : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కొరియన్‌ డ్రామా నటుడు సాంగ్‌ జే రిమ్‌ (39) తన ఇంటిలో కన్నుమూశారు. సాంగ్‌ జే రిమ్‌ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. కే-డ్రామాలు ‘ది మూన్‌ ఎంబ్రేసింగ్‌ ది సన్‌’, ‘క్వీన్‌ వూ’లో కీలక పాత్రలు పోషించిన జే రిమ్‌ మంచి నటునిగా పేరు తెచ్చుకున్నారు. సాంగ్‌ జే రిమ్‌ మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన నటుడు ఇక ఈ లోకంలో లేడంటే నమ్మలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం …. పోలీసులు సాంగ్‌ జే రిమ్‌ మృతిపై  దర్యాప్తు చేపట్టారు. జే రిమ్‌ ఇంటిలో పోలీసులకు ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యమయ్యింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు జే రిమ్‌ కుటుంబ సభ్యులు లేదా ఇటు సియోల్‌ పోలీసులు గానీ మీడియాకు నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు. సాంగ్‌ జే రిమ్‌ అంత్యక్రియలు నవంబర్‌ 14న జరగనున్నాయి. సాంగ్‌ జే రిమ్‌  మృతికి  విచారం వ్యక్తం చేస్తూ అతని అభిమానులు సోషల్‌ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 2009లో సాంగ్‌ జే రిమ్‌ నటనను ప్రారంభించారు. తొలుత 2011లో మూన్‌ ఎంబ్రేసింగ్‌ ది సన్‌లో నటించారు. ఆ తర్వాత ఇండిస్టీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

➡️