శాన్ జువాన్ : ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో కరేబియన్ ద్వీపమైన ప్యూర్టో రికాలో చీకట్లు కమ్ముకున్నాయి. భారీ పవర్ గ్రిడ్ కుప్పకూలిందని ద్వీపదేశంలో విద్యుత్ పంపిణీని పర్యవేక్షిస్తున్న ప్రైవేట్ కంపెనీ లూమా ఎనర్జీ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 1.3 మిలియన్లకు పైగా జనాభాకు విద్యుత్ లేదని, సుమారు 90 శాతం మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి రెండు రోజుల సమయం పట్టవచ్చని లూమా ఎనర్జీ తెలిపింది. పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య ఎదురైందని తెలిపింది. అయితే గ్రిడ్ కుప్పకూలడానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. 2017లో నాలుగో కేటగిరీ తుపాన్ అయిన మారియా హరికేన్‌తో పవర్‌గ్రిడ్ తీవ్రంగా ధ్వంసమైంది. మరోవైపు నిర్వహణ , పెట్టుబడులు లేకపోవడంతో వ్యవస్థ మరింత క్షీణించింది.
