‘ప్రెసిడెంట్‌ మస్క్‌’ టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ

Feb 9,2025 22:57 #elon musk, #remarks

ప్రపంచ బిలీయనర్‌ ఎలాన్‌ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ టైమ్‌ మ్యాగజైన్‌ ఓ కవర్‌ పేజీని ప్రచురించడం సంచలనంగా మారింది. ఓవల్‌ ఆఫీస్‌లోని అమెరికా అధ్యక్షుడి స్థానంలో మస్క్‌ కాఫీ కప్‌తో కూర్చొని ఉన్నట్లుంది. అలాగే, ”ఇన్‌సైడ్‌ ఎలాన్‌ మస్క్‌ వార్‌ ఆన్‌ వాషింగ్టన్‌” అనే పేరుతో కవర్‌ పేజీ కథనం రాసింది. ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రంప్‌ కోసం మస్క్‌ చేసిన కృషిని, ప్రస్తుత ట్రంప్‌ ప్రభుత్వానికి అందిస్తున్న సహకారాన్ని వివరించింది. దేశంలో ఉన్న మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మస్క్‌ దయపై ఆధారపడి ఉందని టైమ్‌ తన కథనంలో తెలిపింది. మస్క్‌ ట్రంప్‌నకు తప్ప మరెవరికీ జవాబుదారీగా వ్యవహరించరని పేర్కొంది. తన అజెండాకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండేలా మస్క్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే యుఎస్‌ఎయిడ్‌ను మూసివేయించారని పత్రిక విమర్శించింది.
కాగా, టైమ్‌ మ్యాగజైన్‌ మస్క్‌ను కవర్‌పేజీపై ప్రచురించడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు కీలకపాత్ర పోషించారని చెబుతూ మస్క్‌ను ‘కింగ్‌ మేకర్‌’గా పేర్కొంది. ‘సిటిజన్‌ మస్క్‌: ఆయన చేయవలసిన జాబితాలో తరువాత ఏంటి?’ అనే టైటిల్‌తో కవర్‌ పేజీని ప్రచురించింది.
అయితే, ట్రంప్‌ కథనంపై ట్రంప్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘టైమ్‌ మ్యాగజైన్‌ ఇంకా నడుస్తోందా..? ఇప్పటి వరకు అది ఉన్న విషయమే నాకు తెలియదు’ అని వెటకారంగా అన్నారు. అలాగే, మస్క్‌ అమెరికాలో జన్మించలేదు కాబట్టి ఆయన ఎప్పటికీ దేశాధ్యక్షుడు కాలేరని ట్రంప్‌ స్పష్టం చేశారు. తన ఆదేశాలకు అనుగుణంగానే ఎలాన్‌ పని చేస్తున్నారని చెప్పారు.

➡️