ప్రధాని బార్నియర్‌ రాజీనామా

Dec 7,2024 00:02 #France, #prime minister

 ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం

పారిస్‌: ప్రధానమంత్రి రాజీనామాతో ఫ్రెంచ్‌ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మిచెల్‌ బార్నియార్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. మొత్తం 577 స్థానాలున్న పార్లమెంటులో 331 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడంతో బార్నియర్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఫ్రాన్స్‌ చరిత్రలో అతి తక్కువ కాలం పాటు ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బార్నియర్‌ నిలిచాడు. ఇప్పుడతని స్థానంలో కొత్త ప్రధానిని నియమించేందుకు అధ్యక్షుడు మాక్రాన్‌ కసరత్తు ప్రారంభించారు. సౌదీ అరేబియాలో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన బార్నియర్‌ శుక్రవారం తన రాజీనామా లేఖను అధ్యక్షుడి ఆమోదానికి పంపారు. బడ్జెట్‌లో సామాజిక భద్రతకు నిధుల కోత పెట్టే పలు పొదుపు చర్యలను ప్రభుత్వం ప్రతిపాదించడంతో అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పార్లమెంటు ఆమోదంతో నిమిత్తం లేకుండా కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి బడ్జెట్‌ ఆమోదం పొందినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాడికల్‌ లెఫ్ట్‌, పచ్చి మితవాది మేరీ లీపెన్‌ నాయకత్వంలనో నేషనల్‌ ర్యాలీ పార్టీలు రెండూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పతనమైంది. ఇది బార్నియర్‌ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు, అధ్యక్షుడు మాక్రాన్‌ వైఫ్యలం కూడా. అందుకే అధ్యక్షుడిగా మాక్రాన్‌ కూడా తప్పుకోవాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. దేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి మాక్రానేనని రాడికల్‌ లెఫ్ట్‌ పార్టీ నాయకుడు మెథిల్దే పనోట్‌ అన్నారు. బార్నియర్‌ నిష్క్రమణ మాక్రాన్‌ ప్రభుత్వ దుర్బలత్వాన్ని తెలియజేస్తోంది. మాక్రాన్‌ మాత్రం తన పదవీ కాల పరిమితి పూర్తయ్యే దాకా గద్దె దిగే ప్రసక్తే లేదంటున్నారు. అధ్యక్షునిగా మాక్రాన్‌ పదవీ కాల పరిమితి 2025 సంవత్సరంలో ముగుస్తుంది. పార్లమెంటరీ మెజార్టీ లేకుండా ఎన్నికైన అతని ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించడానికి బలహీనమైన పొత్తులపై ఆధారపడింది. ఈ ఎత్తుగడ ఇప్పుడు బెడిసికొట్టింది.

➡️