- వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజె
న్యూయార్క్ : స్వేచ్ఛా దీపం ఆరిపోకుండా, సత్యాన్వేషణ కొనసాగేలా, కొందరి ప్రయోజనాల కోసం ఎందరో గొంతుకలను అణచివేయకుండా చూసేందుకు తమ వంతు కషి సాగించాలని ప్రజలకు ముఖ్యంగా పాత్రికేయులకు వికీలీక్స్ వ్యవస్థాపకులు జూలియన్ అసాంజే పిలుపునిచ్చారు. వ్యవస్థ గాడి తప్పినందునే అవాస్తవ న్యాయాన్ని కాదని స్వేచ్ఛను ఎంచుకున్నానని చెప్పారు. అమెరికా సైనిక రహస్యాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలపై జైల్లో ఉన్న ఆయన ఈ ఏడాది జూన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అమెరికా యుద్ధోన్మాద వికృత రూపాన్ని వికీలీక్స్ ద్వారా బయటపెట్టిన ప్రజావేగుగా ఆయన ప్రపంచ ప్రాచుర్యం పొందారు. అత్యంత గట్టి భద్రతా ఏర్పాట్లు కలిగిన బ్రిటన్ జైల్లో ఐదేళ్ళు నిర్బంధంలో వుండడంపై యురోపియన్ పార్లమెంట్ కౌన్సిల్ ఒక నివేదికను ప్రచురించింది. ఈ సందర్భంగా అసాంజే మాట్లాడారు. విడుదల అనంతరం బహిరంగంగా ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. తన స్వేచ్ఛను రక్షించుకునేందుకు చేసిన న్యాయపరమైన, చట్టపరమైన పోరాటం, ప్రయత్నాలు సరిపోలేదని, అందుకే అమెరికా గూఢచర్య ఆరోపణల నేరాన్ని అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. వ్యవస్థ సక్రమంగా పనిచేయనందునే తాను స్వేచ్ఛను పొందలేకపోయానని అన్నారు. ఏళ్ళ తరబడి కారాగారంలో మగ్గిపోయిన అనంతరం జర్నలిజం నేరాన్ని అంగీకరించిన తర్వాతనే తాను స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చానన్నారు. ‘నేను చివరకు అవాస్తవిక న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. జర్నలిజం, విశ్వసనీయ వర్గాల నుంచి సమాచార సేకరణ, వాటిని బహిర్గతం చేశానని అంగీకరించినందునే జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జర్నలిజం నేరం కాదు. స్వేచ్ఛాయుత, సమాచార సమాజానికి మూలస్తంభం. ముఖ్య అంశం ఏంటంటే.. తమ విధులను నిర్వర్తిస్తున్నందుకు జర్నలిస్టులను విచారించవద్దు’ అని ఐరోపా కౌన్సిల్‌లోని న్యాయ, మానవహక్కుల వ్యవహారాల కమిటీ ముందు జూలియన్ అసాంజే చెప్పారు.