16, 17 తేదీల్లో పుతిన్‌ చైనా పర్యటన

May 15,2024 00:14 #China, #tour, #Vladimir Putin

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఈ వారం చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రష్యా, చైనా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశదుంది. రష్యా అధ్యక్షుడిగా అయిదవ సారి బాధ్యతలు చేపట్టిన తరువాత పుతిన్‌ జరుపుతున్న మొదటి విదేశీ పర్యటన ఇది. చైనా ఆహ్వానం మేరకు ఆ దేశంలో ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజులపాటు పుతిన్‌ అధికారికంగా పర్యటించనున్నారని రష్యా అధ్యక్ష భవనం (క్రెమ్లిన్‌) మంగళవారం నాడొక ప్రకటనలో తలెఇపింది. ఇరు దేశాల అధినేతల మద్య జరిగే శిఖరాగ్ర సమావేశంలో సమగ్ర భాగస్వామ్యం, వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుందని క్రెమ్లిన్‌ తెలిపింది.రష్యా ప్రధాని లీ కియాంగ్‌తో కూడా పుతిన్‌ సమావేశమవుతారు. ఈశాన్య చైనాలోని హర్బిస్‌ నగరాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. దీనిని 19వ శతాబ్దం చివరిలో రష్యన్‌ సెటిలర్ల కోసం స్థాపించారు.రష్యా, చైనా అనేక దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కలిగివున్నాయి. 2022 ఫిబ్రవరి ప్రారంభంలో ” రెండు దేశాల మద్య స్నేహానికి హద్దుల్లేవు. సహకారానికి ‘నిషిద్ధ’ ప్రాంతాలు లేవు” అని ఇరు దేశాలు ప్రకటించాయి. చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ 2023లో రష్యాలో జరిపిన పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆర్థిక సహకారానికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అదే సంవత్సరం అక్టోబరులో పుతిన్‌ బీజింగ్‌లోని బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఫోరమ్‌కి హాజరయ్యారు.

➡️