మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం సైనిక దుస్తుల్లో కర్స్క్ సందర్శించారు. కర్స్క్ పశ్చిమప్రాంతం నుండి వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టాలని ఉన్నత కమాండర్లను ఆదేశించారు. బుధవారం కర్స్క్ చేరుకున్న ఆయన అక్కడ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిగణించాల్సిందిగా అమెరికా కోరిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు రష్యా అంగీకరిస్తుందని ఆశిస్తున్నామని, లేకుంటే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయవచ్చని అమెరికా బెదిరింపులకు దిగడంతో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో సాధ్యమైనంత తక్కువ సమయంలో కర్స్క్ ప్రాంతంలో స్థిరపడిన శత్రువును నిర్ణయాత్మకంగా ఓడించడమే తమ కర్తవ్యమని అన్నారు. వాస్తవానికి సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడం గురించి ఆలోచించాలని అన్నారు.
కర్స్క్‌లో ఒకప్పుడు ఆక్రమించుకున్న 86శాతం భూభాగం కంటే ఎక్కువ భూభాగం నుండి తమ సైన్యం ఉక్రెయిన్ దళాలను బయటకు నెట్టాయని రష్యా జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ కోసం జరిగే చర్చల్లో కర్స్క్‌ను పావుగా ఉపయోగించుకోవాలన్న ఉక్రెయిన్ ప్రణాళిక విఫలమైందని అన్నారు. గత ఐదురోజుల్లో రష్యన్ దళాలు ఉక్రెయిన్ సైన్యం నుండి 24 స్థావరాలను, 259 చదరపు కిలోమీటర్ల భూమిని, 400 మందికి పైగా ఖైదీలతో సహా తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.