రైసికి కన్నీటి వీడ్కోలు – తబ్రీజ్‌లో లక్షలాది మంది నివాళి

May 22,2024 09:15 #A tearful farewell, #Raisi

– నేడు టెహ్రాన్‌కు భౌతికకాయం
– రేపు మషాద్‌లో ఖననం
తబ్రీజ్‌ : ప్రియతమ నేతను కడసారి వీక్షించేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు తజ్రీజ్‌కు పోటెత్తారు. ఆదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఇరాన్‌ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ అంతిమ యాత్ర మంగళవారం ప్రారంభమయింది. తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ రాజధాని తబ్రీజ్‌లో ప్రారంభమైన ఈ యాత్రలో తమ అభిమాన నేత కడసారి చూపు కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. అధ్యక్షుడి చిత్రాలను, ఇరాన్‌ జాతీయ జెండాలను ప్రదర్శస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తబ్రీజ్‌ సెంట్రల్‌ స్క్వేర్‌ నుంచి యాత్ర సాగింది. ఇరాన్‌లో ఇతర నగరాల్లో కూడా రైసీ అంతిమ యాత్ర జరగనుంది. తబ్రీజ్‌ తరువాత ఇరాన్‌లో మతపరంగా ముఖ్య పట్టణమైన కోమ్‌లో రైసీ అంతిమ యాత్ర సాగింది. బుధవారం దేశ రాజధాని టెహ్రాన్‌లో భారీ ఎత్తున అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఇక్కడ జరిగే ప్రార్థనలకు సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వం వహించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గననున్నారు. రైసీ అంత్యక్రియలను అతను పుట్టి పెరిగిన, ఇరాన్‌లో రెండో అతి పెద్ద పట్టణం మసాద్‌లో గురువారం నిర్వహించనున్నారు.
కాగా హెలికాప్టర్‌ ప్రమాదంపై విచారణ కొనసాగుతున్నట్లు ఇరాన్‌ అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, కఠినంగా ఉన్న భూభాగం, సాంకేతిక సమస్యలు వంటి అంశాలు కారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే దట్టమైన పొగమంచుతో కూడి ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో హెలికాఫ్టర్‌ను టేకాఫ్‌ చేయడానికి ఎలా అనుమతించారనే అంశంపైనా విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

➡️