హెచ్‌ 1బి వీసాదారులకు ఊరట

May 17,2024 00:34 #H1B Visa
  •  ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండొచ్చు : నిబంధనలు సవరించిన అమెరికా

న్యూయార్క్‌ : హెచ్‌ 1బి వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట కలిగించే మాట చెప్పింది. ఈ వీసాదారులు ఉద్యోగం కోల్పోయినా గ్రేస్‌ పీరియడ్‌కు మించి దేశంలో మరికొంత కాలం ఉండే విధంగా నిబంధనలు సవరించింది. ఇటీవల అమెరికాలో ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా జరుగుతోంది. అనేక ప్రముఖ సంస్థలు అకారణంగా, ఎక్కువ సమయం నోటీసులు ఇవ్వ కుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలస వచ్చిన ఉద్యోగుల కోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌) తన నిబంధనలు సవరించింది. ఇప్పటి వరకూ ఉద్యోగం కోల్పోయిన హెచ్‌ 1బి వీసాదారులు అమెరికాలో కేవలం రెండు నెలలు (60 రోజులు) మాత్రమే ఉండేందుకు వీలుంది. తాజా సవరణతో ఈ గ్రేస్‌ పీరియడ్‌కు మించి వీరంతా అమెరికాలో ఉండొచ్చు. దీని కోసం వీరంతా మళ్లీ ప్రత్యేకంగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఇఎడి)కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇఎడి వచ్చిన తరువాత దీనితో కనీసం మరో 180 రోజలపాటు దేశంలో ఉండటానికి అధికారులు అనుమతిస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌ 1బి వీసాదారులు ఈ అవకాశంతో కొత్త ఉద్యోగాలు అన్వేషించడానికి సమయం దొరుకుతుందని, అక్రమ వలసలు నివారించవచ్చునని అధికారులు చెబుతున్నారు.

➡️