ఇమ్రాన్‌, ఖురేషిలకు ఊరట

Jun 4,2024 08:05 #Imran Khan, #Pakistan
  • సిఫర్‌ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు, అలాగే ఆ పార్టీ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషికి భారీ ఊరట లభించింది. సిఫర్‌ కేసులో వీరిరువురిని నిర్దోషులుగా ఇస్లామాబాద్‌ హైకోర్టు (ఐహెచ్‌సి) ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి అమర్‌ ఫరూక్‌, న్యాయమూర్తి జస్టిస్‌ మియాంగుల్‌ హస్సన్‌ ఔరంగజేబ్‌ సంక్షిప్త తీర్పు చెప్పారు.. ‘ఈ ఇద్దరిపై మరే ఇతర కేసులూ లేకపోతే వెంటనే విడుదల చేయవచ్చు’ అని కూడా తీర్పులో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ వెంటనే విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇద్దత్‌ కేసులో శిక్ష పడగా, ఇదే కేసులో ఖురేషిని మే 9న అరెస్టు చేశారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఏదిఏమైనా ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పుపై పిటిఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన కేసుల్లోనూ ఇమ్రాన్‌ నిర్ధొషిగా బయటపడతాడనే విశ్వాసాన్ని ఒమర్‌ అయూబ్‌ వ్యక్తం చేశారు. మరో నాయకులు షిబ్లీ ఫరాజ్‌ మాట్లాడుతూ ఇద్దరి నాయకుల వెనుక న్యాయం ఉందని అన్నారు. సెనెటర్‌ అలీ జాఫర్‌ మాట్లాడుతూ తీర్పు ఆలస్యమైనా, న్యాయం విజయం సాధించిందని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ తరుపు న్యాయవాది సల్మాన్‌ సప్దర్‌ మాట్లాడుతూ ‘ఇమ్రాన్‌ఖాన్‌ దేశద్రోహి కాదని, ఆయన ఏం చేసినా దేశ ప్రయోజనాల కోసమే’ చేశారని చెప్పారు.

➡️