- అమెరికా నిర్ణయం
- ఈ పని ఎప్పుడో చేయాల్సిందన్న క్యూబా
వాషింగ్టన్ : క్యూబాను ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి ఆ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేయాలని చూసిన అమెరికా ఎట్టకేలకు ఒక అడుగు దిగొచ్చింది. అమెరికా ప్రవచిత ఉగ్రవాద జాబితా నుంచి క్యూబా పేరును తొలగించాలని అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు మాత్రం యధావిధిగా కొనసాగించడం వల్ల ప్రయోజనం పరిమితమేనని క్యూబా విదేశాంగ మంత్రి రోడ్రిగ్యూ పరిల్లా వ్యాఖ్యానించారు. హెల్మ్స్-బర్టన్ చట్టం కింద దాఖలయ్యే పిటిషన్లకు వ్యతిరేకంగా అమెరికా న్యాయస్థానాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివారించేందుకు అధ్యక్షుని విశేషాధికాన్ని ఉపయోగించాలని కూడా నిర్ణయించింది. అమెరికా పౌరులు, సంస్థలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకుండా ఆంక్షలు విధించిన క్యూబా సంస్థల జాబితాను రద్దు చేయాలని చెబుతోంది.. ఈ మేరకు వైట్‌హౌస్ ఈ నెల 14న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యల వల్ల పరిమితమైన ప్రయోజనాలే వున్నప్పటికీ క్యూబా ప్రజలు, ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి లభించిన విజయంగా పేర్కొనవచ్చు. 2017 నుండి మరిన్ని ఆంక్షలను అమెరికా రుద్దింది. ఉగ్రవాద జాబితా నుంచి తొలగిస్తే చాలదు, ఆరు దశాబ్దాలకు పైగా అనుసరిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని క్యూబన్లు, అమెరికాలో ఆ దేశ పౌరులు కోరుతున్నారు.