వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా రాజ్యాంగ పేజీని తొలగించడం అందులో గుర్తించదగ్గ పరిణామంగా వుంది. ఆ పేజీలో ప్రస్తుతం ‘404 ఎర్రర్’ అని చూపిస్తోంది. ఈ మార్పుకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రాధమిక పత్రాలపై ట్రంప్ ప్రభుత్వ వైఖరి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హోమ్ పేజీలో ప్రస్తుతం ట్రంప్ ఫోటో, అమెరికా ఈజ్ బ్యాక్ అనే సందేశం కనిపిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న చర్యలు, జారీ చేసిన ఆదేశాలు వివరాలు, అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఆ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. కానీ రాజ్యాంగం పేజీ కనబడకపోవడం ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. అయితే ఇతర అనేక పేజీలు కూడా ఇదే ఎర్రర్‌ను చూపిస్తున్నాయి. పైగా స్పానిష్ భాషలో వున్న అధికార వైట్‌హౌస్ వెబ్‌సైట్‌ను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. అయితే వైట్‌హౌస్ వెబ్‌సైట్‌ను ఎడిటింగ్ సహా ఇతరత్రా మార్పులు చేపడుతున్నామని, ఈ క్రమంలో కొంత ఇబ్బందులు ఎదురవచ్చని త్వరలోనే మొత్తం రీ లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ కార్యదర్శి హారిసన్ ఫీల్డ్స్ చెప్పారు.
