పాక్‌ ఎన్నికల ఫలితాల్లోనూ రిగ్గింగ్‌

Feb 12,2024 10:57 #Pakistan
Rigging in Pakistan election results
  •  గెలుపు ధ్రువీకరణ పత్రాలు తారుమారు
  • పార్లమెంటు, రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో అతిపెద్ద పార్టీగా పిటిఐ
  • విజయం మాదేనన్న ఇమ్రాన్‌ 
  • 10 కేంద్రాల్లో నేడు రీపోలింగ్‌

ఇస్లామాబాద్‌ : సైన్యం కనుసన్నల్లో జరిగిన పాకిస్తాన్‌ సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌ దగ్గర నుండి ఫలితాల వెల్లడి దాకా భారీ అవకతవకలు జరిగాయని లోకం కోడై కూస్తోంది. ఓట్ల రిగ్గింగే కాదు, చివరికి గెలుపు ధ్రువీకరణ పత్రాల జారీలోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుతో పోటీ చేసిన ఇండిపెండెంటు అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించారు.అయితే విజేతగా నిలిచినవారిని పరాజితులుగా పేర్కొంటూ తప్పుడు పత్రాలు (ఫారం 47)ను రిటర్నింగ్‌ అధికారి జారీ చేయడం వివాదానికి దారి తీసింది. ఆదివారం ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు నుంచి పంపిన విజయోత్సవ సందేశంలో ఫలితాన్ని తారుమారు చేసిన ఆ రిటర్నింగ్‌ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పిటిఐ మూడింట రెండొంతుల విజయం సాధించిందని ఆయన చెప్పారు. ఈ విజయానికి తోడ్పాటునందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా వుండగా భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పది కేంద్రాల్లో సోమవారం రిపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్ల లెక్కింపు ముగిసే సరికి మొత్తం 264 స్థానాలకు గాను ఇమ్రాన్‌ నేతృత్వంలోని పిటిఐకి 93, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌)కు 75, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీకి 54, ఇతర చిన్న పార్టీలకు 42 స్థానాలు వచ్చినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేనందున సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం మద్దతుతో నవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ జర్దారీ భుట్టో ప్రయత్నిస్తునట్లు వార్తలొస్తున్నాయి..

➡️