మాస్కో : 337 ఉక్రెయిన్ డ్రోన్‌లను రష్యా వైమానిక దళం కూల్చివేసింది. సోమవారం రాత్రి పదికి పైగా రష్యన్ ప్రాంతాలపై ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మూడేళ్ల యుద్ధంలో రష్యాపై అదిపెద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడిగా పేర్కొంది.
అత్యధికంగా 126 డ్రోన్లు ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని కుర్స్క్ ప్రాంతంపై కూల్చివేయగా, మాస్కోపై ప్రయోగించిన 91 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటితో పాటు ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గోరోడ్, బ్రయాన్స్క్, వొరొనెజ్, రష్యా లోపలి ప్రాంతాలైన కలుగా , లిపెట్స్క్, నిజ్ని నొవ్‌గోర్‌డ్, ఓరియోల్, రియాజాన్‌లపై దాడులు జరిగాయని తెలిపింది. రష్యా రాజధాని లక్ష్యంగా ప్రయోగించిన 70కి పైగా డ్రోన్లను రక్షణ దళాలు అడ్డుకుని, కూల్చివేశాయని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించగా, పలువురికి గాయాలయ్యాయని, పలు నివాస భవనాల సముదాయంలోని ఏడు అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయని అన్నారు. పార్కింగ్‌లలో ఉన్న పలు కార్లు దగ్ధం కాగా, మరో ప్రాంతంలోని అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.
డొమోడెడోవు, వ్నుకోవో, షెరెమెటియేవో, జుకోవ్స్కీ, యారోస్లావెల్ మరియు నిజ్నీనోవ్‌గోరోడ్ ప్రాంతాల్లోని విమానాశ్రయాలు సహా ఆరు విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
రష్యాతో మూడేళ్ల యుద్ధాన్ని ముగించడం గురించి ఉక్రెయిన్ ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో అమెరికా అత్యున్నత దౌత్యవేత్తతో సమావేశమైన సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారులు స్పందించాల్సి వుంది.