మాస్కో : గూఢచర్యం ఆరోపణలపై ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలను ఎంబసీ నుండి రష్యా బహిష్కరించింది. దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరుతూ వారిద్దరూ తప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని అందజేసినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బి) ఒక ప్రకటనలో తెలిపింది. పైగా రష్యా భద్రతకు ముప్పు కలిగించే విధంగా వారు ఇంటెలిజెన్స్, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంది. దౌత్యవేత్తల అక్రిడిటేషన్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వార్తా సంస్థ రియా నొవొస్తి తెలిపింది. రెండు వారాల్లోగా దేశాన్ని వీడి వెళ్లాలని ఆదేశించింది. బ్రిటీష్ ఎంబసీ అధికారికి సమన్లు జారీ చేసినట్లు రష్యా విదేశాంగ శాఖ మరో ప్రకటనలో తెలిపింది. రష్యా భూభాగంపై అప్రకటిత బ్రిటీష్ నిఘా అధికారుల కార్యకలాపాలను సహించేది లేదని ఆ ప్రకటన స్పష్టం చేసింది. దీనిపై బ్రిటన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. గతేడాది సెప్టెంబరులో ఆరుగురిని, నవంబరులో ఒకరిని రష్యా బహిష్కరించింది. ఆ సమయంలో అవన్నీ నిరాధారమైన ఆరోపణలంటూ బ్రిటన్ కొట్టిపారేసింది. దీనికి బదులుగా బ్రిటన్ కూడా తమ దేశంలో మాస్కో దౌత్య కార్యకలాపాలకు పరిమితి విధించింది. రష్యా ఎంబసీ అటాచీ క్రెడెన్షియల్స్ కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. నవంబరు నాటి బహిష్కరణ చర్యలకు నిరసనగా గత నెల్లో ఒక రష్యా దౌత్యవేత్తను బ్రిటన్ బహిష్కరించింది. ఉక్రెయిన్ యుద్ధంపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ బహిష్కరణలు జరిగాయి.
ఇద్దరు బ్రిటీష్ దౌత్యవేత్తల బహిష్కరణ – గూఢచర్యం చేసినట్లు ప్రకటించిన రష్యా
