మాస్కో : రక్షణ దళాలు నల్ల సముద్ర జలాలు సహా వివిధ ప్రాంతాలపై ప్రయోగించిన తొమ్మిది ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి కూల్చివేసిన డ్రోన్‌లలో రెండు నల్ల సముద్రం జలాలపై ఉన్నాయని పేర్కొంది. రష్యా సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ భవనంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక పౌరుడు గాయపడ్డారని బెల్గరోడ్ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ తెలిపారు. ఆ వ్యక్తి తలకు గాయమైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. దాడిలో భవనానికి కూడా స్వల్ప నష్టం వాటిల్లినట్లు గ్లాడ్కోవ్ టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. అయితే ఈ డ్రోన్లు నల్లసముద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయా లేదా జలాలపై ఎగురుతున్నాయా అనే అంశంపై స్పష్టత లేదు. ఎన్ని డ్రోన్లను కూల్చివేశాయి అని మాత్రమే రక్షణ శాఖ నివేదించింది.
నల్లసముద్రంపై, ఇంధన లక్ష్యాలపై దాడులను నిలిపివేయడానికి రష్యా, ఉక్రెయిన్‌లతో అమెరికా మంగళవారం వేర్వేరు ఒప్పందాలను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మాస్కోపై కొన్ని ఆంక్షలను ఎత్తివేయడానికి కూడా అంగీకరించింది. నల్లసముద్రంపై ఒప్పందాలు ఎప్పుడు, ఏవిధంగా అమల్లోకి వస్తాయనే అంశంపై స్పష్టత లేదు.