మాస్కో : ఏప్రిల్ 13 సుమీ నగరంపై రష్యా క్షిపణి దాడి చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడుల వల్ల 20 మందికిపైగా మృతి చెందారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెరాస్ రష్యా చర్యను తప్పుపడుతూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గుటెరస్ వ్యాఖ్యలపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. ‘ఐక్యరాజ్యసమితి కార్యదర్శి గుటెరస్ వ్యాఖ్యలు గందరగోళ వ్యాఖ్యలుగానే భావించాలి. ఎందుకంటే రష్యన్ దళాలు మొదటి నుంచి జనాభాను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా దాడులు చేయలేదు. కేవలం సైనిక స్థావరాల్ని మాత్రమే లక్ష్యంగా రష్యన్ దళాలు దాడులు చేస్తాయి’ అని ఆమె వెల్లడించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అంతర్జాతీయ చట్టం, తీర్మానాలకనుగుణంగా ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటం కోసం శాంతిని సాధించే ప్రయత్నాల్లో భాగంగానే గుటెరస్ ఆ ప్రకటను చేసి ఉంటారని రష్యా జఖరోవా అన్నారు. అలాగే జెలెన్‌స్కీ చర్యలపైనా ఆమె మండిపడ్డారు. రష్యా జాతికి చెందిన వారిని, రష్యన్ భాష మాట్లాడేవారిపై జెలెన్‌స్కీ బృందం ప్రాథమిక నియమాలను పదేపదే ఉల్లంఘిస్తోంది. వారిపైన దాడులు చేస్తోంది. భాషా, మతం, మానవ హక్కులను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ఆర్టికల్ 1 పిలుపునిస్తుంది. ప్రజల స్వయం నిర్ణయాధికారం, మానవ హక్కులను గౌరవించడం అనే చట్టబద్ధమైన సూత్రాల పట్ల కైవ్ పాలన నిర్లక్ష్యాన్ని మాత్రం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎప్పుడూ కప్పిపుచుతూనే ఉంటారు అని జఖరోవా చురకలంటించారు.
